Ayatollah Ali Khamenei: మీకోసం నరక ద్వారాలు తెరిచి ఉంచుతున్నాం... అమెరికా, ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులు

Ayatollah Ali Khamenei Death Iran Retaliation Against US Israel
  • అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం
  • ప్రతీకారంగా గంటల వ్యవధిలోనే విరుచుకుపడ్డ ఇరాన్ సైన్యం
  • కువైట్, దుబాయ్‌లోని అమెరికా బేస్‌లే లక్ష్యంగా క్షిపణి దాడులు
  • దుబాయ్ ఎయిర్‌పోర్ట్ సహా పలు కీలక ప్రాంతాల్లో పేలుళ్లు
  • యుద్ధం విస్తరించే ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. ఇరాన్ అణు చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా నిర్వహించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణించడం తెలిసిందే. టెహ్రాన్‌తో పాటు పలు నగరాలపై జరిగిన ఈ భీకర వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గంటల వ్యవధిలోనే తన ప్రతాపాన్ని చూపించింది. ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4’ పేరుతో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జీసీ) అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై విరుచుకుపడింది. శత్రువులకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది. 

అమెరికా బేస్‌లే లక్ష్యంగా..
ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ఐదో దశ దాడులను ముమ్మరం చేసింది. కువైట్‌లోని అబ్దుల్లా ముబారక్ ప్రాంతంలో ఉన్న అమెరికన్ నావల్ బేస్‌పై 4 బాలిస్టిక్ క్షిపణులు, 12 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో బేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ధ్వంసమైందని, పలువురు అమెరికన్ సైనికులు మరణించారని సమాచారం. అటు హిందూ మహాసముద్రంలోనూ ఇరాన్ అలజడి సృష్టించింది. అమెరికా నౌకలకు ఇంధనం సరఫరా చేస్తున్న కంబాట్ సపోర్ట్ షిప్‌పై ‘ఖద్ర 380’ క్షిపణులతో దాడి చేసింది.

మరోవైపు, దుబాయ్‌లోని జెబెల్ అలీ యాంకరేజ్‌లో అమెరికాకు ఆయుధాలు చేరవేస్తున్న నౌకపై కూడా డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడుల తీవ్రతకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అంతకుముందు పామ్ ఐలాండ్, బుర్జ్ అల్ అరబ్ ప్రాంతాల్లోనూ దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. పర్షియన్ గల్ఫ్ దేశాలతో పాటు ఇరాక్ కుర్దిస్తాన్‌లోని అమెరికా బేస్‌లపై కూడా ఇరాన్ ఎయిర్ ఫోర్స్ బాంబుల వర్షం కురిపించింది.

శత్రువులకు నరకమే..
తమ నాయకుడి మరణానికి ప్రతీకారంగా ‘చరిత్రలోనే అత్యంత భయంకరమైన అఫెన్సివ్ ఆపరేషన్’ చేపడతామని ఐఆర్ జీసీ హెచ్చరించింది. "శత్రువులకు నరక ద్వారాలు తెరిచి ఉంచుతాం.. ఇమామ్ హంతకులకు కచ్చితంగా శిక్ష పడుతుంది" అని టెలిగ్రామ్ వేదికగా ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, కతార్‌లలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ఆయా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. శత్రువులకు సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ పరోక్షంగా హెచ్చరించింది.

పరిస్థితి చేయిదాటిపోతుండటంతో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్ స్పందించారు. తక్షణమే హింసను ఆపాలని, లేదంటే ప్రపంచ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. అటు రష్యా, యూరోపియన్ యూనియన్ కూడా ఇరు పక్షాలు సంయమనం పాటించాలని కోరాయి. ఏది ఏమైనా ఖమేనీ మరణం తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పినట్లు కనిపిస్తోంది.
Ayatollah Ali Khamenei
Iran
America
Israel
Middle East conflict
military strikes
Operation True Promise 4
US naval base
IRGC
Persian Gulf

More Telugu News