Andy Jassy: ఉద్యోగాలను ఏఐ తీసేయదు.. స్వరూపాన్ని మారుస్తుంది: అమెజాన్ సీఈవో

AI will change jobs not end them Amazon CEO Andy Jassy
  • ఏఐ వ‌ల్ల‌ కొత్త రకం ఉద్యోగాలు పుట్టుకొస్తాయన్న ఆండీ జెస్సీ
  • ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మోర్గాన్ స్టాన్లీ నివేదిక
  • గతంలో టెక్నాలజీ మారినప్పుడల్లా కొత్త ఉద్యోగాలు వచ్చాయని వెల్ల‌డి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోతాయనే భయాలు అతిశయోక్తి కావొచ్చని అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ అభిప్రాయపడ్డారు. ఉద్యోగ అవకాశాలను పూర్తిగా తొలగించడం కంటే, పని స్వభావాన్ని ఏఐ పునర్నిర్మించే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.

ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... గత రెండు మూడు దశాబ్దాలుగా మానవ శ్రమపై ఎక్కువగా ఆధారపడిన అనేక పనులకు భవిష్యత్తులో తక్కువ మంది అవసరమవుతారని జెస్సీ అంగీకరించారు. అయితే, దీనివల్ల ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయని అర్థం కాదన్నారు. "గత 20-30 ఏళ్లుగా మనం మానవ శ్రమతో చేస్తున్న చాలా పనులకు భవిష్యత్తులో అంతమంది అవసరం ఉండకపోవచ్చని నేను నమ్ముతున్నాను. కానీ, అదే సమయంలో కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయి. ప్రతి సాంకేతిక మార్పు జరిగినప్పుడు ఇలాగే జరిగింది" అని ఆయన వివరించారు.

ఇదిలా ఉంటే... ఏఐ ఉద్యోగాలను నాశనం చేయదని, వాటి స్వరూపాన్ని మాత్రమే మారుస్తుందని పలు నివేదికలు కూడా సూచిస్తున్నాయి. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. "కొన్ని పనులు ఆటోమేట్ అయినప్పటికీ, చాలా మంది ఉద్యోగులు శాశ్వతంగా ఉపాధి కోల్పోయే అవకాశం లేదు. బదులుగా చాలా మంది ఇంకా ఉనికిలో లేని పాత్రలతో సహా కొత్త రకాల ఉద్యోగాలకు మారతారని అంచనా వేస్తున్నాం" అని ఆ నివేదిక పేర్కొంది.

తన వాదనకు మద్దతుగా గత 150 ఏళ్లలో విద్యుత్, యాంత్రీకరించిన వ్యవసాయం, కంప్యూటర్లు, ఇంటర్నెట్ వంటి ప్రధాన సాంకేతిక మార్పులను మోర్గాన్ స్టాన్లీ ఉదహరించింది. ఈ ఆవిష్కరణలు పరిశ్రమలను మార్చాయి కానీ మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేయలేదని గుర్తు చేసింది. 1980లలో స్ప్రెడ్‌షీట్‌ల రాకను దీనికి మంచి ఉదాహరణగా పేర్కొంది. స్ప్రెడ్‌షీట్‌లు కొన్ని క్లరికల్ పనుల అవసరాన్ని తగ్గించినా, ఆర్థిక నిపుణులు మరింత సంక్లిష్టమైన, అధిక విలువైన పనులపై దృష్టి పెట్టేందుకు వీలు కల్పించాయి. ఇది ఆర్థిక రంగంలో కొత్త కెరీర్‌లను సృష్టించడానికి దారితీసింది.
Andy Jassy
Amazon CEO
Artificial Intelligence
AI impact
Job market
Future of work
Morgan Stanley report
Automation
Technological change
New jobs

More Telugu News