Revanth Reddy: సీఎం రేవంత్‌తో మాజీ మావోయిస్టు నేతల భేటీ

Revanth Reddy Meets with Former Maoist Leaders
  • సచివాలయంలో సీఎంను కలిసిన ఆరుగురు మాజీ మావో నేతలు
  • సీఎంను కలిసిన వారిలో దేవ్‌జీ, రాజిరెడ్డి, బడే చొక్కారావు తదితరులు
  • పలు అంశాలపై చర్చలు జరిగినట్టు సమాచారం

దశాబ్దాల పాటు అడవిని నమ్ముకుని సాయుధ పోరాటం చేసిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఇప్పుడు ప్రజాస్వామ్య మార్గంలోకి అడుగుపెడుతున్నారు. కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ కగార్' చివరి అంకానికి చేరుకోవడంతో, కీలక నేతలు వరుసగా లొంగిపోతున్నారు. ఈ క్రమంలో, హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆరుగురు మాజీ మావోయిస్టు నేతలు ఈరోజు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇటీవలే డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయిన సీనియర్ నేతలు తిప్పిరి తిరుపతి (దేవ్‌జీ), మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), బడే చొక్కారావు (దామోదర్), నూనె నరసింహారెడ్డి (గంగన్న)లతో పాటు సుజాతక్క, చంద్రన్నలు ముఖ్యమంత్రిని కలిశారు. దశాబ్దాల అజ్ఞాతవాసం తర్వాత ఈ అగ్రనేతలంతా నేరుగా అధికార కేంద్రమైన సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.


ముఖ్యమంత్రితో భేటీకి వెళుతున్న సమయంలో మీడియా ప్రతినిధులు "సీఎంతో ఏం చర్చిస్తారు?" అని ప్రశ్నించగా, అగ్రనేత దేవ్‌జీ స్పందిస్తూ "పొలిటికల్ ఎజెండా" అని క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. దీనితో వీరంతా భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. లొంగిపోయిన నేతల పునరావాసం, వారి కుటుంబాల భద్రతపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వీరు చేపట్టబోయే తదుపరి కార్యాచరణపై సీఎంకు వివరించినట్లు సమాచారం.

Revanth Reddy
Telangana
Former Maoists
Naxalites
Operation Kagar
Surrender
Telangana Politics
Political Agenda
Hyderabad Secretariat

More Telugu News