Konaseema: కోనసీమ జిల్లాలో పరువు హత్య.. చెల్లిని పెళ్లి చేసుకున్నాడని యువకుడిని చంపేసిన అన్నలు

Konaseema Honor Killing PVV Suryaprakash Rao Murdered by Wifes Brothers
  • గురువారం అన్నవరంలో పెళ్లి.. మరుసటి రోజే దారుణం
  • వేర్వేరు కులాలు కావడంతో యువతి కుటుంబ సభ్యుల ఆగ్రహం
  • అర్ధరాత్రి దాడి చేసి బండరాయితో తలపై మోది చంపిన యువతి సోదరులు
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమ చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఇద్దరు సోదరులు ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. కులాంతర వివాహం చేసుకోవడమే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారపూడి శివారు వేములపల్లిలో వస్త్ర వ్యాపారం చేసుకునే పీవీవీ సూర్యప్రకాశరావు(41), రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న అయినవిల్లి సంధ్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ హైస్కూలు స్నేహితులు కావడం విశేషం. 

సూర్యప్రకాశరావుది తమ కులం కాకపోవడంతో సంధ్య కుటుంబం వీరి ప్రేమను తిరస్కరించింది. అయినా సరే, ఒకటవ్వాలని నిశ్చయించుకున్న ఈ జంట గురువారం ఉదయం అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత సంధ్యను తీసుకుని సూర్యప్రకాశరావు వేములపల్లిలోని తన నివాసానికి వెళ్లారు. తమ చెల్లెలి పెళ్లి విషయం తెలిసి సూర్యప్రకాశరావుపై సంధ్య సోదరులు చంద్రపాల్, గిరిబాబు కక్ష పెంచుకున్నారు.

అర్ధరాత్రి కిరాతకం..
గురువారం అర్ధరాత్రి సమయంలో సూర్యప్రకాశరావు ఇంటిపై దాడి చేసిన నిందితులు.. అతడిని బయటకు లాగి బండరాయితో ముఖంపై చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సూర్యప్రకాశరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న స్థానికులు నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన మండపేట రూరల్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన 24 గంటలు గడవకముందే భర్త కళ్లముందే విగతజీవిగా పడి ఉండటం చూసి భార్య సంధ్య శోకసముద్రంలో మునిగిపోయింది.
Konaseema
honor killing
inter caste marriage
Andhra Pradesh crime
murder
Annavaram
Chandrapal
Giribabu
PVV Suryaprakash Rao

More Telugu News