PM Modi: ఇజ్రాయెల్ టెక్నాలజీపై ప్రధాని మోదీ దృష్టి.. భారత్-ఇజ్రాయెల్ బంధం మరింత బలోపేతం

PM Modi Focus on Israel Technology Boosts India Israel Ties
  • భారత్‌లో పెట్టుబడులు, తయారీ కోసం ముందుకు రావాలని ఇజ్రాయెల్ కంపెనీలకు మోదీ ఆహ్వానం
  • ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి అక్కడి టెక్నాలజీ ప్రదర్శనను సందర్శించిన మోదీ
  • వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్యం వంటి రంగాల్లో సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని వెల్ల‌డి
  • గాలి నుంచి నీరు, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి టెక్నాలజీలను పరిశీలించిన ప్ర‌ధాని
భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి, తయారీ యూనిట్లు స్థాపించడానికి, సాంకేతిక భాగస్వామ్యాలు నిర్మించుకోవడానికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని మోదీ ఇజ్రాయెల్ కంపెనీలను ఆహ్వానించారు. గురువారం ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ఇజ్రాయెల్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక టెక్నాలజీ ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ ఈ పిలుపునిచ్చారు.

ఈ ప్రదర్శనలో వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్యం, స్మార్ట్ మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ టెక్నాలజీస్ వంటి అనేక రంగాల్లో ఇజ్రాయెల్ సాధించిన అద్భుతమైన ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలు కంపెనీల సీఈఓలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలతో ప్రధాని మోదీ నేరుగా సంభాషించారు. ఇక్కడ ప్రదర్శించిన అత్యాధునిక సాంకేతికతలు భారత్-ఇజ్రాయెల్ మధ్య ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, వ్యాపార భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి ఎంతగానో దోహదపడతాయని మోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్య సేవలు, డిజిటల్ రంగాల్లో సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ పర్యటనలో భాగంగా గాలి నుంచి తాగునీటిని ఉత్పత్తి చేసే 'వాటర్‌జెన్' టెక్నాలజీని, గురుత్వాకర్షణ శక్తితో పనిచేసే మైక్రో-ఇరిగేషన్ వ్యవస్థ 'ఎన్-డ్రిప్'ను మోదీ ఆసక్తిగా పరిశీలించారు. అలాగే, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సెన్సార్లు, చిప్ టెక్నాలజీని ప్రదర్శించిన 'మొబైల్‌ఐ' సంస్థ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారంగా పనిచేసే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరికరం, సైబర్ దాడులను నిరోధించే వ్యవస్థలు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి పలు కీలక ఆవిష్కరణల గురించి అధికారులు ప్రధానికి వివరించారు.

ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు "ఇండియా-ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ బ్రిడ్జ్" కార్యక్రమం కింద ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సాంకేతిక, వాణిజ్య సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు.
PM Modi
Israel technology
India Israel relations
Benjamin Netanyahu
Watergen technology
N-Drip irrigation
Mobileye
Artificial intelligence
Cyber security
Quantum technologies

More Telugu News