Vivek Banzal: బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ ప్రయాగ్‌రాజ్ పర్యటన కోసం 50 మంది సిబ్బంది... కేంద్రమంత్రి తీవ్ర ఆగ్రహం

Vivek Banzal BSNL Director Faces Action Over Prayagraj Visit Demands
  • డైరెక్టర్ ప్రయాగ్‌రాజ్ పర్యటనకు 50 మంది సిబ్బందిని కేటాయించాలని ఆదేశాలు
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఆదేశాలు
  • వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కేంద్రం షోకాజ్ నోటీసు
తన ప్రయాగ్‌రాజ్ పర్యటన ఏర్పాట్ల కోసం బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజల్ చేసిన డిమాండ్లు వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అతడికి కేంద్రం షోకాజ్ నోటీసు జారీ చేసింది. వివేక్ బంజల్ తీరుపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అధికారి వివరణ ఆధారంగా అతడిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

వివేక్ బంజల్ ప్రయాగ్ రాజ్ పర్యటన కోసం వివిధ పనుల నిమిత్తం 50 మంది బీఎస్ఎన్ఎల్ సిబ్బందిని కేటాయించాలని డిప్యూటీ మేనేజర్ స్థాయి అధికారి నుంచి ఆదేశాలు వచ్చాయి. రైల్వే స్టేషన్‌లో దిగినప్పుడు స్వాగతం పలకడం మొదలు వివిధ పనుల కోసం సిబ్బంది ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. స్వాగతం పలకడం, ఆలయ సందర్శన కోసం ఏర్పాట్లు, బోట్ రైడ్స్ సమన్వయం, టవల్స్, అండర్ గార్మెంట్లు, నూనె, దువ్వెన, స్నానం కిట్లు, మతపరమైన కార్యకలాపాల కోసం రవాణా సౌకర్యాలు, ఫొటోలు తీయడం, వాహనాల్లో వాటర్ బాటిల్స్, చాక్లెట్లు, స్నాక్స్ ఉండేలా చూడాలని ఆదేశాలు వచ్చాయి.

ఈ విస్తృత సన్నాహాలకు సంబంధించిన ఆర్డర్ ఆన్‌లైన్‌లో వెలుగులోకి రావడంతో వివాదంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అధికార, వనరుల దుర్వినియోగంపై మండిపడ్డారు. ఈ వ్యవహారం కేంద్రమంత్రి దృష్టికి రావడంతో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని బంజల్‌కు షోకాజ్ నోటీసు జారీ అయింది. ఇది నిబంధనల ఉల్లంఘన కిందకి వస్తుందని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.
Vivek Banzal
BSNL
Jyotiraditya Scindia
Prayagraj visit
Show cause notice
BSNL Director
Controversy

More Telugu News