Hyderabad Police: హైదరాబాదులో అక్రమంగా నివసిస్తున్న 23 మంది విదేశీయుల అరెస్ట్

Hyderabad Police Arrest 23 Illegal Foreign Nationals
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గోల్కొండ జోన్ పరిధిలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటున్న 23 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు.

గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్రమోహన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సుమారు 250 మంది పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పారామౌంట్ కాలనీ (గేట్లు 1 నుంచి 4), ఐఏఎస్ కాలనీ, హకీంపేట్ కుంట ప్రాంతాల్లో పక్కా సమాచారంతో పోలీసులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) అధికారుల సహాయంతో ఈ సోదాలు జరిగాయి. వివిధ దేశాలకు చెందిన 23 మంది అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. వీరి వీసా, పాస్‌పోర్ట్ గడువు ముగిసినట్లు తేలింది.

ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న 9 గ్యాస్ సిలిండర్లు, చట్టవిరుద్ధంగా నిల్వ ఉంచిన 53 మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, నివాస చట్టాలను కఠినంగా అమలు చేస్తామని డీసీపీ చంద్రమోహన్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. 

కాగా, అదుపులోకి తీసుకున్న విదేశీయులు ఏ దేశస్థులనే వివరాలను పోలీసులు వెల్లడించలేదు. టోలిచౌకి, పారామౌంట్ కాలనీ ప్రాంతాల్లో ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారు ఎక్కువగా నివసిస్తుంటారు. గతంలోనూ డ్రగ్స్ సంబంధిత కేసుల్లో ప్రమేయం ఉన్న పలువురు విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి దేశాలకు తిప్పి పంపిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Hyderabad Police
Foreign Nationals
Illegal Immigrants
Tolichowki
Cordon and Search Operation
Visa Expiry
FRRO
Deportation
Paramount Colony
G Chandramohan

More Telugu News