Nara Lokesh: కోవా బన్ వ్యాపారి వలీకి అండగా ఉంటాం: మంత్రి నారా లోకేశ్ భరోసా

Nara Lokesh assures support to Kova bun vendor Vali
  • మేడారం జాతరలో కర్నూలు చిరు వ్యాపారికి వేధింపులు
  • 'ఫుడ్ జిహాద్' ఆరోపణలతో వేధింపులకు పాల్పడిన యూట్యూబర్లు
  • ఘటనపై తీవ్రంగా స్పందించిన మంత్రి నారా లోకేశ్
  • బాధితుడు వలీకి క్షమాపణ చెబుతూ ట్వీట్
  • త్వరలోనే వలీని కలుస్తానని, కోవా బన్ తింటానని హామీ
తెలంగాణలోని మేడారం జాతరలో కర్నూలుకు చెందిన ఓ చిరు వ్యాపారి వేధింపులకు గురికావడం పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బాధితుడైన వలికి బహిరంగంగా క్షమాపణ చెప్పారు.

వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లాకు చెందిన వలీ అనే చిరు వ్యాపారి మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకుంటున్నాడు. ఈ క్రమంలో కొందరు యూట్యూబర్లు అతడిని అడ్డుకుని, 'ఫుడ్ జిహాద్' చేస్తున్నావంటూ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, అతడితో బలవంతంగా కోవా బన్ తినిపించారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియోపై స్పందించిన నారా లోకేశ్, తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ చేశారు. "ప్రియమైన సోదరుడు వలీ గారూ, మీకు ఈ బాధ కలిగినందుకు చాలా విచారంగా ఉంది. ఇలాంటి విభజనకరమైన, మతతత్వ ప్రవర్తనకు మన తెలుగు సమాజంలో చోటు లేదు. మన సమాజం ఎల్లప్పుడూ సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావంతో నిలిచింది" అని లోకేశ్ పేర్కొన్నారు.

అంతేకాకుండా, "త్వరలో మిమ్మల్ని కలిసి మీ ఫేమస్ కోవా బన్ రుచి చూడాలని ఎదురుచూస్తున్నాను! మనమంతా కలిసి ఉందాం" అంటూ వలీకి భరోసా ఇచ్చారు. లోకేశ్ స్పందనపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Nara Lokesh
Kova bun
Vali
Medaram Jatara
Food Jihad
Kurnool
Telangana
Andhra Pradesh
Social harmony

More Telugu News