Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on Branding and Quality for Products
  • స్వయం సహాయక సంఘాల కోసం 'స్వయం' పేరుతో ప్రత్యేక బ్రాండ్
  • రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం
  • రూ.300 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం వేగవంతం చేయాలని సూచన
రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించారు. ఐదో బ్లాకులో జరిగిన ఈ సమావేశంలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, గ్రీన్ కవర్ వంటి పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. నాణ్యమైన ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్ జోడిస్తేనే మెరుగైన మార్కెట్ సాధ్యమవుతుందని, ఈ దిశగా అధికారులు దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల కోసం 'స్వయం' అనే పేరుతో ప్రత్యేక బ్రాండ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ బ్రాండ్ ద్వారా వారి ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ అందుబాటులోకి వస్తుందన్నారు. అరకు కాఫీ తరహాలోనే కోకో పంటకు కూడా మంచి బ్రాండ్ తీసుకురావాలని సూచించారు.

పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాలని ఆదేశించారు. నగరాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్టీపీ) నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ చేపట్టాలన్నారు. రూ.300 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, దీనికి అవసరమైన నిధులను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) సమకూరుస్తుందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులతో పేరుకుపోయిన చెత్తను (లెగసీ వేస్ట్) వేగంగా తొలగించాలని స్పష్టం చేశారు.

50శాతం పచ్చదనమే లక్ష్యం
రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఉగాది నుంచి పాఠశాలల్లో దేశీయ వృక్ష జాతుల పెంపకంపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. తీరప్రాంత కోత నివారణకు ఉపముఖ్యమంత్రి చేపట్టిన ప్రాజెక్టును అభినందించిన సీఎం, కోతను అరికట్టడంతో పాటు రైతులకు ఆదాయం అందించేలా ఆర్కిడ్స్ సాగును ప్రోత్సహించాలని సూచించారు.
Chandrababu
Andhra Pradesh
product branding
quality products
self-help groups
ARAKU coffee
sewage treatment plants
Swachh Andhra
green cover
native tree species

More Telugu News