Allu Arjun: హైదరాబాదులో సమావేశమైన అల్లు అర్జున్ అభిమాన సంఘం సభ్యులు

Allu Arjun Fans Association Meeting Held in Hyderabad
  • సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందేంచేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు
  • రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి
  • ఫ్యాన్స్ అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అల్లు అర్జున్ గుర్తించారంటన్న అభిమానులు
అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందేంచేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్‌లో నిన్న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్‌, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వారు ప్రకటించారు. 

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సమావేశంలో స్టేట్ లెవల్ కమిటీతో పాటు జిల్లా, టౌన్ స్థాయి కమిటీల ఏర్పాటు అంశంపై చర్చించారు. ఈ కమిటీలు భవిష్యత్తులో ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయని నేతలు తెలిపారు. అలాగే ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించడం వంటి లక్ష్యాలతో ప్రణాళికలు రూపొందించారు. అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించేలా అసోసియేషన్ కార్యకలాపాలు ఉండాలని వారు సూచించారు. 

టాలీవుడ్‌లో ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలకు ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. కొన్నేళ్లుగా అవి సక్రమంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా తన అభిమానుల కోసం ప్రత్యేకంగా బలమైన ఫ్యాన్స్ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఇక ‘పుష్ప 2’ విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన సందర్భంగా అల్లు అర్జున్ తరఫున ప్రజలకు విషయాలను సమర్థవంతంగా చేరవేసే వ్యవస్థ బలహీనంగా కనిపించిందనే చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అల్లు అర్జున్ గుర్తించారని అభిమానులు భావిస్తున్నారు.
Allu Arjun
Allu Arjun Fans Association
Hyderabad
Social Service
Telugu States
Pushpa 2
Fans Association Meeting
Tollywood

More Telugu News