T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026.. అందరి కళ్లూ ఈ 10 మంది ఆటగాళ్లపైనే!

T20 World Cup 2026 All Eyes on These 10 Players
షార్ట్స్‌లో చూడండి
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026కు రంగం సిద్ధమైంది. రేప‌టి నుంచి భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈసారి ప్రపంచకప్ వ్యూహాత్మకంగా ఎంతో భిన్నంగా ఉండనుంది. ఒకవైపు భారత్‌లోని బ్యాటింగ్ స్వర్గధామాలపై పరుగుల వరద పారే అవకాశం ఉండగా, మరోవైపు శ్రీలంకలోని నెమ్మదైన పిచ్‌లు స్పిన్నర్లకు, ఓపికతో ఆడే బ్యాటర్లకు పరీక్ష పెట్టనున్నాయి.

ఈ పొట్టి ఫార్మాట్‌లో పవర్‌ప్లేలో చెలరేగడం, మిడిల్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయడం, డెత్ ఓవర్లలో ఒత్తిడిని జయించడం వంటి కీలకమైన ల‌క్షణాలే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తాయి. గతాన్ని చూస్తే, కొద్దిమంది ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలే టోర్నమెంట్ గమనాన్ని మార్చేశాయి. ఈ నేపథ్యంలో ఈసారి ప్రపంచకప్‌లో తమదైన ముద్ర వేయగల 10 మంది ఆటగాళ్లపై ఓ లుక్ వేద్దాం.

భారత ఆటగాళ్లు:
  • టీమిండియా దూకుడుకు నిదర్శనం అభిషేక్ శర్మ. పవర్‌ప్లేను అవకాశంగా మలచుకుని బౌలర్లపై విరుచుకుపడతాడు. 
  • ఇక, బిగ్ టోర్నీ స్పెషలిస్ట్ హార్దిక్ పాండ్యా ఒత్తిడిలో రాణించగల సామర్థ్యంతో జట్టుకు సంపూర్ణ సమతుల్యం అందిస్తాడు. 
  • ఒకప్పుడు మిస్టరీ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న వరుణ్ చక్రవర్తి, ఇప్పుడు నియంత్రణ, వ్యూహంతో పవర్‌ప్లేలోనే వికెట్లు తీయగలడు. 
  • బ్యాటర్ల ఆధిపత్యం నడిచే ఈ ఫార్మాట్‌లోనూ తన యార్కర్లు, వైవిధ్యమైన బంతులతో మ్యాచ్‌ను శాసించగల బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా.

అంతర్జాతీయ స్టార్లు:
  • ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి వ్యూహాలను చిన్నాభిన్నం చేయగలడు. 
  • శ్రీలంక పిచ్‌లపై ఆ జట్టు స్పిన్ సంచలనం వనిందు హసరంగ అత్యంత ప్రమాదకారి. కీలక సమయాల్లో వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగలడు. 
  • దక్షిణాఫ్రికాకు క్వింటన్ డి కాక్ తన సొగసైన ఆటతో పవర్‌ప్లేలో ఆధిపత్యం చెలాయిస్తాడు.
  • ఇంగ్లండ్ దూకుడుకు ప్రతిరూపం ఫిల్ సాల్ట్. 
  • ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వెన్నెముక కాగా, ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్, పేస్ బౌలింగ్‌తో జట్టుకు కీలకం కానున్నాడు.

మొత్తం మీద ఈ ప్రపంచకప్ శక్తికి, యుక్తికి మధ్య జరిగే పోరుగా నిలవనుంది. మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నీలో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో తెలియాలంటే, ఈ కీలక ఆటగాళ్ల ప్రదర్శనపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఒక్క ఓవర్ ఆటను మార్చే ఈ ఫార్మాట్‌లో వీరి ప్రదర్శన కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Go Back to Shorts
T20 World Cup 2026
Abhishek Sharma
Hardik Pandya
Jasprit Bumrah
Travis Head
Wanindu Hasaranga
Rashid Khan
Quinton de Kock
T20 Cricket
Cricket World Cup

More Telugu News