Kovvuru Road Accident: కొవ్వూరు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.... ముగ్గురు యువకులు మృతి

Kovvuru Road Accident Three Youths Died on Bridge
  • కొవ్వూరు బ్రిడ్జ్ పై ఢీకొన్న రెండు ద్విచక్ర వాహనాలు 
  • సరదాగా సినిమా చూద్దామని బయలుదేరిన యువకులు ప్రమాదానికి గురైన వైనం
  • కొవ్వూరుకు చెందిన అక్షయ్ కుమార్, సునీల్, రాజమండ్రికి చెందిన లక్ష్మీనారాయణ మృతి
సినిమా చూసొద్దామని సరదాగా బయలుదేరిన ముగ్గురు యువకుల జీవితాలు రోడ్డు ప్రమాదంలో అర్థాంతరంగా ముగిశాయి. సినిమాకు వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. ఈ హృదయవిదారక ఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జిపై చోటుచేసుకుంది. 

నిన్న రాత్రి కొవ్వూరు పట్టణంలోని శ్రీనివాసపురానికి చెందిన పోతుగుంట అక్షయ్‌కుమార్‌ (20), కొమిరి ఏడుకొండలు (18), గాజుల వారి వీధికి చెందిన తగరపు సత్యకళ్యాణ్‌ అలియాస్‌ సునీల్‌ (20) ముగ్గురూ కలిసి పల్సర్‌ బైక్‌పై సినిమా చూడడానికి రాజమండ్రి బయలుదేరారు. అదే సమయంలో రాజమండ్రి క్వారీ మార్కెట్‌ ప్రాంతానికి చెందిన ఆనాపు లక్ష్మీనారాయణ (34) యాక్టివాపై కొవ్వూరు వైపు వస్తుండగా, రోడ్డు కం రైలు బ్రిడ్జి 104వ స్తంభం వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. 

ఈ ప్రమాదంలో అక్షయ్‌కుమార్‌, సునీల్‌, లక్ష్మీనారాయణలకు తలలకు తీవ్ర గాయాలు కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఏడుకొండలుకు స్వల్ప గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర వైద్యం నిమిత్తం రాజమండ్రి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పట్టణ సీఐ పి.విశ్వం సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా బ్రిడ్జిపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పోలీసులు క్లీయర్ చేశారు. 
Kovvuru Road Accident
Road accident
Kovvuru
East Godavari
Rajamahendravaram
bike accident
youth death
Andhra Pradesh
accident news

More Telugu News