Varla Ramaiah: ఆ విషయంలో జగన్ ఇప్పటికైనా చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: వర్ల రామయ్య

Varla Ramaiah Demands Jagan Apology to Chandrababu in Skill Development Case
  • నాడు స్కిల్ కేసులో చంద్రబాబును ఇరికించడం కక్ష సాధింపు చర్యేనన్న వర్ల రామయ్య
  • 53 రోజుల పాటు జైల్లో పెట్టి చంద్రబాబు జీవిత కాలాన్ని దొంగిలించారని విమర్శలు
  • 'మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్' అంటూ సీఐడీనే కేసును ఉపసంహరించుకుందని వెల్లడి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి, ఆయన జీవితంలోని 53 విలువైన రోజులను గత జగన్ ప్రభుత్వం దొంగిలించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబుపై కేవలం రాజకీయ కక్షతోనే తప్పుడు కేసు బనాయించారని, ఇందుకు జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

గతంలో రాష్ట్రాన్ని వివిధ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్యమంత్రులు పాలించారని, అప్పుడు ప్రభుత్వాల మధ్య అభివృద్ధి, ప్రజాసేవలో మాత్రమే పోటీ ఉండేదని వర్ల రామయ్య గుర్తుచేశారు. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రాజకీయాల్లోకి కక్ష, ద్వేషం, ఫ్యాక్షనిజం ప్రవేశించాయని ఆరోపించారు. అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ పాలనతో రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు నాశనం చేశారని మండిపడ్డారు.

ఈ కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుపై స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. సీమెన్స్ ప్రాజెక్టుకు విడుదలైన నిధులు చంద్రబాబుకు గానీ, ఆయన కుటుంబ సభ్యులకు గానీ చేరలేదని స్పష్టంగా తెలిసినప్పటికీ, రాజకీయ ప్రత్యర్థిని శత్రువుగా భావించి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్రతో చంద్రబాబును 53 రోజుల పాటు జుడిషియల్ కస్టడీలో ఉంచి జగన్ తన కక్ష తీర్చుకున్నారని విమర్శించారు.

అయితే, సీఐడీ దర్యాప్తులోనే డిజైన్‌టెక్‌కు చెల్లించిన నిధులు ఏ ప్రజాప్రతినిధికీ చేరలేదని, ప్రతి రూపాయికి లెక్క ఉందని తేలిందని వర్ల రామయ్య తెలిపారు. దీంతో ఈ కేసును ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా పేర్కొంటూ వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఈడీ కూడా ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేసిందని గుర్తుచేశారు. జైలులో కనీస సౌకర్యాల కోసం కూడా చంద్రబాబు కోర్టును ఆశ్రయించాల్సి రావడం జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని అన్నారు.

చంద్రబాబు జైలులో ఉన్న 53 రోజులూ రాష్ట్ర ప్రజలు ఆయన సేవలను గుర్తుచేసుకున్నారని, ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనకు ఇటీవలి ఎన్నికల్లో 11 సీట్లతో ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఒక నిజాయతీపరుడైన నాయకుడిని జైలులో పెట్టినందుకు ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయని చెప్పారు. ఇప్పటికైనా జగన్ కు నైతిక విలువలు ఉంటే.. చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి, టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
Varla Ramaiah
Chandrababu Naidu
Skill Development Case
TDP
Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
Political Vendetta
CID Investigation
Corruption Allegations
Telugu Desam Party

More Telugu News