Pawan Kalyan: కెంజుట్సులో పవన్ కల్యాణ్ కు ప్రవేశం... ప్రత్యేక సందేశం పంపించిన ప్రధాని మోదీ

Pawan Kalyan Enters Kenjutsu Receives Message from Modi
  • జపనీస్ మార్షల్ ఆర్ట్ కెంజుట్సులో పవన్ కల్యాణ్ కు ప్రవేశం
  • పవన్‌ను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ
  • పవన్ క్రమశిక్షణ, నిబద్ధత యువతకు ఆదర్శమని కొనియాడిన ప్రధాని
  • ప్రధాని మోదీ అభినందనలకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్
  • మోదీ నాయకత్వంపై ప్రశంసలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. జపనీస్ యుద్ధ క్రీడ ‘కెంజుట్సు’లో పవన్ కల్యాణ్ అధికారిక ప్రవేశం పొంది అరుదైన ఘనత సాధించడం పట్ల మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రత్యేక అభినందన సందేశాన్ని పంపారు. రాజకీయాలు, సినిమా రంగాల్లో అత్యంత బిజీగా ఉంటూనే, దశాబ్దాలుగా మార్షల్ ఆర్ట్స్‌లో పవన్ చూపిస్తున్న అంకితభావం, క్రమశిక్షణ ఎంతో స్ఫూర్తిదాయకమని మోదీ కొనియాడారు.

ప్రధాని మోదీ తన సందేశంలో, “జపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలో మీరు సాధించిన విజయాల గురించి తెలుసుకున్నాను. కెంజుట్సులో అధికారిక ప్రవేశం ద్వారా ఘనత సాధించినందుకు నా హృదయపూర్వక అభినందనలు. ప్రజా జీవితం, సినిమా కెరీర్‌లో బిజీగా ఉంటూనే క్రమశిక్షణతో మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడం ప్రశంసనీయం. మీ దశాబ్దాల సాధన యువతరానికి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. వృత్తిపరమైన బాధ్యతలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అడ్డంకి కాదని మీరు నిరూపించారు” అని పేర్కొన్నారు. 

యుద్ధ కళలకు శారీరక బలంతో పాటు మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణ ఎంతో అవసరమని, ఇంతటి కఠినమైన సంప్రదాయాన్ని అనుసరించడం పవన్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ‘ఫిట్ ఇండియా’ వంటి కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ వంటి ప్రజా ప్రతినిధులు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.

ప్రధాని అభినందనలు గొప్ప గౌరవం: పవన్ కల్యాణ్

ప్రధాని నరేంద్ర మోదీ పంపిన అభినందన సందేశం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధానికి కృతజ్ఞతాపూర్వక లేఖను పంపించారు. “మోదీజీ పంపిన ఆత్మీయ సందేశం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మీ ప్రేమపూర్వక సందేశం నాకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. యుద్ధ కళల పట్ల క్రమశిక్షణ, ఏకాగ్రత నా జీవిత ప్రయాణంలో ఏళ్లుగా అంతర్భాగంగా ఉన్నాయి. ఇవి శారీరక వ్యాయామంతో పాటు ఒత్తిడిని తట్టుకునే శక్తినిస్తాయి” అని పవన్ తన లేఖలో వివరించారు.

ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రధాని మోదీ తీసుకొచ్చిన ‘ఫిట్ ఇండియా’ వంటి కార్యక్రమాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమని పవన్ ప్రశంసించారు. “మీ నాయకత్వంలో బలమైన, దృఢమైన భారతదేశం నిర్మితమవుతోంది. మీలాంటి గొప్ప నాయకుడి నుంచి లభించిన ఈ ప్రోత్సాహం, అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలన్న నా సంకల్పానికి మరింత బలాన్నిస్తుంది. ప్రతి అడుగులో మీరు ఇస్తున్న మద్దతుకు రుణపడి ఉంటాను,” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ ఇరువురు నేతల మధ్య జరిగిన ఈ ఆత్మీయ సంభాషణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Pawan Kalyan
Pawan Kalyan Kenjutsu
Narendra Modi
AP Deputy CM
Japanese martial arts
Fit India
Andhra Pradesh politics
Kenjutsu
Martial arts
Indian politics

More Telugu News