తేజస్ యుద్ధ విమానం క్రాష్... పైలట్ మృతి చెందినట్టు ప్రకటించిన ఐఏఎఫ్
- దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం
- ప్రదర్శన ఇస్తుండగా జరిగిన ప్రమాదంలో పైలట్ మృతి
- ఘటనను అధికారికంగా ధ్రువీకరించిన భారత వాయుసేన
- ప్రమాద కారణాలపై విచారణకు ఆదేశం
- తేజస్ విమానానికి ఇది రెండో ప్రమాదం
ప్రపంచంలోని అతిపెద్ద ఏవియేషన్ ప్రదర్శనలలో ఒకటైన దుబాయ్ ఎయిర్ షోలో ఏరియల్ డిస్‌ప్లే ఇస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తేజస్ యుద్ధ విమానానికి సంబంధించి ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. 2001లో తొలిసారి గాల్లోకి ఎగిరినప్పటి నుంచి సుమారు 23 ఏళ్ల చరిత్రలో మొదటి ప్రమాదం 2024 మార్చిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో జరిగింది. అయితే ఆ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
తేజస్ 4.5వ తరం, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయగల మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇది వైమానిక దాడులు, క్లోజ్ కంబాట్, భూమిపై దాడి వంటి పలు రకాల పాత్రలను సులభంగా నిర్వహించగలదు. ఈ దుర్ఘటనతో దుబాయ్ ఎయిర్ షోలో విషాదఛాయలు అలుముకున్నాయి.