Mohammed Aan: నీట్ విద్యార్థి ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

Mohammed Aan NEET Aspirant Suicide in Kanpur
  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నీట్ విద్యార్థి ఆత్మహత్య
  • హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం
  • ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్
నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన తల్లిదండ్రులను క్షమించమని కోరుతూ విద్యార్థి రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. రాంపూర్‌కు చెందిన మహమ్మద్ ఆన్ (21) నీట్ కోచింగ్ కోసం కాన్పూర్‌లోని రావత్‌పూర్‌లో ఉన్న ఓ హాస్టల్‌లో నాలుగు రోజుల క్రితమే చేరాడు. శుక్రవారం మధ్యాహ్నం, అతని రూమ్‌మేట్ ఇమ్దాద్ హసన్ ప్రార్థనలకు వెళ్దామని పిలవగా, మహమ్మద్ నిరాకరించాడు. ఇమ్దాద్ తిరిగి వచ్చి చూసేసరికి గదికి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా మహమ్మద్ నుంచి స్పందన రాకపోవడంతో ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ మహమ్మద్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. అతని మృతదేహం వద్ద ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

"అమ్మా, నాన్న నన్ను క్షమించండి. నేను తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాను. మీ కలలను నేను నెరవేర్చలేను. అందుకే నా జీవితాన్ని ముగిస్తున్నాను. దీనికి నేనే బాధ్యుడిని" అని ఆ లేఖలో మహమ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mohammed Aan
NEET
NEET Exam
Kanpur
Suicide
Student Suicide
Uttar Pradesh
NEET Coaching
Stress
Suicide Note

More Telugu News