మాకు భారత్ సాయం కావాలి.. అమెరికా ఆర్థిక మంత్రి
- అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు
- ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సవాలేనన్న స్కాట్ బెసెంట్
- అమెరికా ప్రపంచ శాంతిని కోరుకుంటుంటే.. చైనా మాత్రం ఆర్థిక యుద్ధం చేస్తోందని ఫైర్
అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఇటీవల ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచంలో మరెక్కడా లభించని అరుదైన ఖనిజాల ఎగుమతిపై చైనా ఇటీవల నియంత్రణ విధించిందని చెప్పారు. విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే చైనా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనే షరతు విధించిందన్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సవాలేనని బీజింగ్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ఇది చైనాకు, ప్రపంచ దేశాలకు మధ్య నెలకొన్న పోటీ అని ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందని ఆయన మండిపడ్డారు. బీజింగ్ దూకుడును అమెరికా అడ్డుకుంటుందన్నారు. ఇందుకోసం భారత్, ఐరోపా దేశాల మద్దతు కావాలని వెల్లడించారు. అమెరికా ప్రపంచ శాంతిని కోరుకుంటుంటే.. చైనా ఆర్థిక యుద్ధం చేస్తోందని స్కాట్ బెసెంట్ దుయ్యబట్టారు.