Nandini: ప్రియురాలిపై ప్రియుడి కిరాతకం.. నడిరోడ్డుపై కాల్చివేత!

Boyfriend Kills Girlfriend Nandini in Gwalior Public Place
  • గ్వాలియర్‌లో పట్టపగలే దారుణ హత్య
  • లివ్-ఇన్ భాగస్వామిని నడిరోడ్డుపై కాల్చిచంపిన ప్రియుడు
  • ఏఐ అశ్లీల వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కారణం
  • గతంలోనూ పలుమార్లు దాడి.. హత్యాయత్నం కేసులు
  • పోలీసులను ఆశ్రయించినా దక్కని ప్రాణాలు  
పోలీసులను ఆశ్రయించినా ఆమె ప్రాణాలకు రక్షణ లభించలేదు. తనను వేధిస్తున్నాడని, అశ్లీల వీడియోలు సృష్టించి బెదిరిస్తున్నాడని ఆమె ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు, అతడు బెదిరించినట్టుగానే ఆమెను అత్యంత కిరాతకంగా, పట్టపగలు నడిరోడ్డుపై కాల్చి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

గ్వాలియర్‌కు చెందిన అర్వింద్ అనే కాంట్రాక్టర్.. నందిని అనే మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. వారి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. తనను శారీరకంగా హింసించడమే కాకుండా, మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టాడని నందిని గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారుతో గుద్ది చంపడానికి కూడా అర్వింద్ ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. ఈ కేసులో అరెస్ట్ అయినా, అర్వింద్ బెయిల్‌పై బయటకు వచ్చాడు.

ఇటీవల అర్వింద్, అతడి సహచరి పూజా పరిహార్ కలిసి ఏఐ టెక్నాలజీతో నందినికి సంబంధించిన అశ్లీల వీడియోలు, ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వాటిని ఆమె కుటుంబ సభ్యులకు కూడా పంపించి వేధించారు. ఈ విషయంపై సెప్టెంబర్ 9న నందిని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తనను చంపేస్తానని అర్వింద్ బెదిరిస్తున్నాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ఈ క్రమంలో శుక్రవారం మరోసారి ఎస్పీ కార్యాలయానికి వెళ్లేందుకు బయలుదేరిన నందినిని రూప్ సింగ్ స్టేడియం ఎదుట అర్వింద్ అడ్డగించాడు. వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆమె ముఖంపై అత్యంత సమీపం నుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె శవం పక్కనే తుపాకీ చేతపట్టుకుని కూర్చుని, ఎవరైనా దగ్గరికి వస్తే కాల్చేస్తానని స్థానికులను, పోలీసులను బెదిరించాడు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. టియర్ గ్యాస్ ప్రయోగించి అర్వింద్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన నందినిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కళ్ల ముందే జరిగిన ఈ ఘటన చూసి తాము షాక్‌కు గురయ్యామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
Nandini
Gwalior crime
Madhya Pradesh murder
Arvind
love affair
crime news
social media harassment
AI video
police complaint
Rup Singh Stadium

More Telugu News