Dulquer Salmaan: 'కొత్త లోక’ డైలాగ్ వివాదం: క్షమాపణలు తెలిపిన దుల్కర్ సల్మాన్ టీమ్

Dulquer Salmaan Apologizes for Kotha Loka Dialogue Controversy
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నటుడు, నిర్మాత దుల్కర్ సల్మాన్ తన నిర్మాణంలో వచ్చిన తాజా చిత్రంపై చెలరేగిన వివాదంపై క్షమాపణలు తెలిపారు. ఆయన నిర్మించిన ‘లోక చాప్టర్ 1 చంద్ర’ చిత్రంలోని ఒక డైలాగ్ కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్న విమర్శల నేపథ్యంలో ఆయన నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ అధికారికంగా స్పందించింది. వివాదాస్పద సంభాషణను సినిమా నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చింది.

ఇటీవల మలయాళంలో విడుదలై విజయం సాధించిన ఈ చిత్రం, తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా క్లైమాక్స్‌లో విలన్ పాత్రధారి బెంగళూరుకు చెందిన అమ్మాయిల వ్యక్తిత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వారిని కించపరిచేలా ఉన్న ఆ డైలాగ్‌తో పాటు, సినిమాలో ‘దగర్’ (వేశ్య) అనే పదాన్ని ఉపయోగించడం కూడా వివాదానికి కారణమైంది. దీంతో కర్ణాటకకు చెందిన పలువురు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై స్పందించిన దుల్కర్ నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. "మా సినిమాలోని సంభాషణ కర్ణాటక ప్రజల మనోభావాలను అనుకోకుండా దెబ్బతీసిందని మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో మేము చింతిస్తున్నాము. ఎవరినీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఆ వివాదాస్పద డైలాగ్‌ను వీలైనంత త్వరగా తొలగించడం లేదా మార్చడం జరుగుతుంది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. "మేము కలిగించిన ఈ ఇబ్బందికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం. దయచేసి మా క్షమాపణను అంగీకరించండి" అని చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది.

కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 28న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్న తరుణంలో ఈ వివాదం చోటుచేసుకుంది.
Go Back to Shorts
Dulquer Salmaan
Kotha Loka
Wayfarer Films
Kannada people
controversial dialogue
Apology
Mollywood movie
Kalyani Priyadarshan
Naslen
Dominic Arun

More Telugu News