పీవోకేను భారత్‌లో కలపాలి.. ఈ విషయంలో మోదీకి మద్దతు తెలుపుతున్నా: రేవంత్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పీవోకేను భారత్‌లో కలపాలి.. ఈ విషయంలో మోదీకి మద్దతు తెలుపుతున్నా: రేవంత్ రెడ్డి

Revanth Reddy Supports Modis Stance on POK
  • పహల్గామ్ దాడిపై హైదరాబాద్‌లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ
  • కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడాలన్న ముఖ్యమంత్రి
  • పాక్‌కు బుద్ధి చెప్పాలన్న రేవంత్ రెడ్డి
  • అభివృద్ధి పథంలో నడుస్తున్న దేశంపై దాడి చేశారని ఆగ్రహం
ఉగ్రవాదంపై పోరులో యావత్ భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అండగా ఉంటుందని, పాకిస్థాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మోదీకి మద్దతు ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. 1971లో పాకిస్థాన్‌కు ఇందిరాగాంధీ గట్టిగా బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీని వాజ్‌పేయి దుర్గామాతతో పోల్చారని తెలిపారు. మనం మరోసారి పాకిస్థాన్‌ను ఓడించాలని, పీవోకేను భారత్‌లో కలపాలని అన్నారు. ఇందిరాగాంధీని గుర్తు చేసుకొని పాక్‌కు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న మనదేశంపై ఉగ్రదాడి జరిగిందని, ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

"140 కోట్ల మంది భారతీయులు రాజకీయాలకు, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరం ఒక్కటై తీవ్రవాదంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అందరినీ ఆహ్వానించింది. భారత ప్రభుత్వానికి అండగా నిలబడాలని, కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతుగా నిలబడాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం" అని రేవంత్ రెడ్డి అన్నారు.

"ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది భావోద్వేగ సందర్భం. ఇలాంటి సమయంలో మనమంతా ఏకమై భారత సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన సందర్భం ఇది. మన దేశం మీద జరిగే దాడులను తిప్పికొట్టేందుకు, కుట్రలు పన్నిన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉండాలి. ఆ కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలి" అని అన్నారు.
Advertisement
Revanth Reddy
Pakistan
POK
India
Terrorism
Narendra Modi
Indira Gandhi
Pulwama Attack
Anti-Terrorism
Telangana

More Telugu News