బుమ్రా వచ్చేశాడుగా... ముంబయి ఇండియన్స్ లో కొత్త జోష్
- గాయం నుంచి కోలుకున్న బుమ్రా
- బుమ్రా పునరాగమనం చేశాడంటూ ముంబయి ఇండియన్స్ ప్రకటన
- రేపు ఆర్సీబీతో ఎంఐ మ్యాచ్ లో ఆడనున్న బుమ్రా!
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను విడుదల చేస్తూ ప్రకటించింది. "గర్జించడానికి సిద్ధం" అనే క్యాప్షన్‌తో వీడియోను పంచుకుంది.
బుమ్రా తిరిగి రావడం ముంబయి ఇండియన్స్‌కు ఎంతో ఊరటనిచ్చే అంశం. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుమ్రా పునరాగమనానికి మార్గం సుగమం అయింది. బుమ్రా రాకతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళం మరింత బలోపేతం అవుతుంది.
బుమ్రా రాకతో జట్టుకు ఒక కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు. బుమ్రా తన కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థులను కట్టడి చేయగలడు. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటూ జట్టుకు విజయాలు అందించగల సత్తా ఈ రైటార్మ్ పేసర్ సొంతం.
ముంబయి ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌లో రేపు వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో బుమ్రా ఎలాంటి ప్రభావం చూపిస్తాడన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.