వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఐదు రకాల స్కూళ్లు

వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఐదు రకాల స్కూళ్లు

AP Govt Ready To Introduce 5 Types Of Schools
  • గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను రద్దు చేయనున్న ప్రభుత్వం
  • విలీనం చేసిన 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకొచ్చే యోచన
  • ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాల
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది నుంచి ఐదు రకాల స్కూళ్లు ఉండబోతున్నాయి. ఇందులో భాగంగా తొలుత గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను రద్దు చేస్తారు. కొత్తగా తీసుకురానున్న విధానంపై తొలుత ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గత ప్రభుత్వం 4,731 పాఠశాలల నుంచి తొలగించి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన 3,4,5 తరగతులను తిరిగి వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేసి విద్యార్థుల సంఖ్యను బట్టి వాటిని ఉన్నతీకరించడం కానీ, ప్రాథమిక బడులుగా మార్చడం కానీ చేస్తారు. 

అలాగే, ఇంటర్మీడియెట్‌తో ఏర్పాటు చేసిన హైస్కూలు ప్లస్ వ్యవస్థను కూడా తీసేసి, ఇంటర్‌ను ఇంటర్మీడియెట్ విద్యాశాఖకు అప్పగించనుంది. గతేడాది డిసెంబర్ 31 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంటారు. అలాగే, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, వంతెనలు, పాఠశాల దూరాన్ని ప్రామాణికంగా తీసుకుని ఐదు రకాల విధానాన్ని అమలు చేయనుంది. 

ఐదు రకాల స్కూళ్లు ఇవే
పూర్వ ప్రాథమిక విద్య 1, 2 (ఎల్‌కేజీ, యూకేజీ) బోధించే అంగన్‌వాడీలను శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా మారుస్తారు. 
పూర్వ ప్రాథమిక విద్య 1, 2తోపాటు 1,2 తరగతులను కలిపి ఫౌండేషన్ పాఠశాలలుగా నిర్వహిస్తారు.
పూర్వ ప్రాథమిక విద్య 1,2తోపాటు 1 నుంచి 5 తరగతులు ఉండేవి బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగా వ్యవహరిస్తారు.
పూర్వ ప్రాథమిక విద్య 1, 2తోపాటు 1 నుంచి 5 తరగతులతో గ్రామ పంచాయతీ, వార్డు, డివిజన్‌కు ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేస్తారు.
6 నుంచి 10 వరకు తరగతులు ఉండేవి ఉన్నత పాఠశాలలు.
Advertisement
Andhra Pradesh
Govt Schools
G.O. 117

More Telugu News