YS Jagan: పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు విషయంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం రాజీపడబోదు: మంత్రి నిమ్మల రామానాయుడు

AP Minister Nimmala Ramanaidu Slams YS Jagan over Polavaram Project Issue
షార్ట్స్‌లో చూడండి
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో తమ ప్రభుత్వం ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని, గతంలో తాము ప్రతిపాదించినట్లు 150 అడుగుల మేర నీటి నిల్వ ఉండే విధంగా 45.72 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ప్రతిపాదనకు చంద్రబాబు సర్కార్ ఒప్పుకుని రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందంటూ వైఎస్ జగన్ చేసిన విమర్శలపై మంత్రి నిమ్మల స్పందించారు. వైసీపీపై కౌంటర్ విమర్శలు చేశారు. 

రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో బుధవారం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ.. రెండు ఫేజులు అంటూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు కుదించిన ఘనత గత ప్రభుత్వానిదేనని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును రెండు ఫేజుల్లో నిర్మిస్తామంటూ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పలు మార్లు  ప్రతిపాదనలు పంపిన గత ప్రభుత్వం, ఆ బురదను తమ ప్రభుత్వంపై రుద్దే విధంగా దుష్ప్రచారం చేయడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. 2022 జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1, 2 అంటూ 41.15 మీటర్ల ఎత్తును ప్రతిపాదిస్తూ అప్పటి స్పెషల్ సీఎస్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు లేఖ వ్రాస్తూ రూ.10,911.15 కోట్ల మేర నిధులు  కావాలంటూ అడగడం జరిగిందన్నారు. తదుపరి జలవనరుల శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ, సీఈ తదితరులు కూడా పలు మార్లు లేఖలు వ్రాయడం జరిగిందన్నారు. వాటిలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లు అంటూ ప్రత్యేకంగా మెన్షన్ చేశారని చెప్పారు.  
 
2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ పోలవరం ప్రాజెక్టును ఫేజ్ 1, ఫేజ్ 2 అంటూ ఎప్పుడూ విభజించలేదని, సుప్రీంకోర్టు, గోదావరి ట్రిబ్యునల్ అనుమతించిన మేరకు 150 అడుగుల మేర నీటిని నిల్వ చేసే విధంగా 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.55,545 కోట్లకు టెక్నికల్ ఎడ్వైజరీ కమిటీ ఆమోదాన్ని కూడా పొందడం జరిగిందన్నారు. తమ కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఏమాత్రం రాజీ పడబోదని, నూటికి నూరు శాతం 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అయితే గత ప్రభుత్వం ఫేజ్-I లో పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు ప్రతిపాదించిన విధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ క్రింద నిధులు విడుదల అవుతాయన్నారు. కానీ ఫేజ్-2 లో మాత్రం 45.72 మీటర్ల మేర ప్రాజెక్టు ఎత్తుకు అనుగుణంగా రూ.30 వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు అవసరం అవుతాయని తాము ప్రతిపాదించామన్నారు. 
 
పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే 2020 లో వచ్చిన వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని  హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం కూడా నిర్థారించినట్లు ఆయన తెలిపారు. 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికై రూ.11,762 కోట్లు ఖర్చు చేస్తే కేవలం రూ.6,764 కోట్లు మాత్రమే కేంద్రం నుండి రీయంబర్స్‌మెంట్ రూపేణా వచ్చాయన్నారు. అయితే గత ప్రభుత్వం కేవలం రూ.4,167 కోట్లను మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించిందని, అయితే కేంద్రం నుండి రూ.8,382 కోట్లు రీయంబర్స్‌మెంట్ రూపేణా  నిధులు వస్తే అందులో రూ.3,385 కోట్లను గత ప్రభుత్వం మళ్లించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఫేజ్-I ప్రతిపాదించిన విధంగా కేంద్రం నుండి రూ.12,250 కోట్ల నిధులు ఈ మధ్యనే అందాయని, అదే గత ప్రభుత్వ హయాంలో అందితే ఈ నిధులను కూడా మళ్లింపు చేసేవారని మంత్రి విమర్శించారు. 
Go Back to Shorts
YS Jagan
Polavaram Project
AP Minister
Nimmala Rama Naidu

More Telugu News