ఈవీఎంలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎలాన్ మస్క్
- ఏఐతో వాటిని హ్యాక్ చేయొచ్చని ఆరోపణ
- అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దని డిమాండ్
- బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించాలన్న స్పేస్ఎక్స్ బాస్
ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికలకు దూరంగా ఉంచాలని కోరారు. ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు చేతులతో లెక్కించే బ్యాలెట్ పేపర్‌తో జరగాలని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మస్క్ ఏమన్నారంటే..
'ఓ సాంకేతిక నిపుణుడిగా కంప్యూటర్ల గురించి నాకు బాగా తెలుసు. కంప్యూటర్ పోగ్రాంలను హ్యాక్ చేయడం చాలా సులభం. పేపర్ బ్యాలెట్ విషయంలో ఆ అవకాశం లేదు. ప్రజాస్వామ్య దేశాలలో పేపర్ బ్యాలెట్ ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలి' అని మస్క్ అభిప్రాయపడ్డారు. కాగా, ఇండియాలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందని, వాటి వాడకాన్ని రద్దు చేయాలని ఎలాన్ మస్క్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.