తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై టీడీపీ, వైసీపీ నీచ రాజ‌కీయాలు: వైఎస్ ష‌ర్మిల

YS Sharmila Reacts CM Chandrababu Tirumala Laddu Animal Ghee Comments
  • తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూపై తీవ్ర రాజకీయ దుమారం 
  • లడ్డూ తయారీకి జంతువుల నూనెలు వాడారన్న‌ సీఎం చంద్రబాబు 
  • చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల 
  • సీఎం వ్యాఖ్యలు తిరుమల పవిత్రత, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయ‌న్న‌ షర్మిల
  • తక్షణమే ఉన్నత స్థాయి కమిటీ వేసి విచార‌ణ జ‌రిపించాల‌ని షర్మిల డిమాండ్‌
తిరుమల శ్రీవెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూపై తీవ్ర రాజకీయ దుమారం న‌డుస్తోంది. ఈ పవిత్ర‌మైన లడ్డూ ప్ర‌సాదం తయారీకి జంతువుల నూనెలు వాడారని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం కలకలం రేపింది. పవిత్రమైన తిరుమల ఆలయంపై అలాంటి వ్యాఖ్యలు చేయడం ప‌ట్ల ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌కు దారితీసింది. 

కాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఖండించారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని ఆమె హితవు పలికారు. ఈ మేర‌కు తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ షర్మిల 'ఎక్స్‌' (ట్విట్ట‌ర్‌) వేదికగా స్పందించారు. 

తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయ‌ని ఆమె మండిప‌డ్డారు. సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రత, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయ‌ని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వ‌రుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయ‌ని తెలిపారు. 

చంద్రబాబు చేసిన ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే... భావోద్వేగం మీద రాజకీయం చేసే ఉద్దేశమే లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే... తక్షణమే ఉన్నత స్థాయి కమిటీ వేయాల‌ని షర్మిల డిమాండ్‌ చేశారు. 

అలాగే సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. మహా పాపానికి.. ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండ‌ని ఆమె సవాల్‌ విసిరారు. చంద్రబాబు తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాల‌ని షర్మిల డిమాండ్ చేశారు.
Go Back to Shorts
YS Sharmila
Chandrababu
Tirumala Laddu

More Telugu News