చేసేది స్వీపర్ పని.. ఇంట్లో మాత్రం కోట్ల విలువైన కార్లు
- ఉత్తరప్రదేశ్ లో అక్రమాలకు పాల్పడుతూ కోట్లకు పడగలెత్తిన స్వీపర్
- ఏకంగా లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన వైనం
- ఆఫీసులో ఫైళ్లు తారుమారు చేస్తూ అక్రమ వసూళ్లు
గోండా జిల్లాకు చెందిన స్వీపర్ సంతోష్ జైస్వాల్ తొలుత గోండా మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా చేరాడు. ఆపై అక్రమంగా డివిజనల్ కమిషనర్ ఆఫీసులో స్వీపర్ గా ప్రమోషన్ పొందాడు. ఆఫీసులో చేరాక అక్రమాలకు తెరతీసి ఎడాపెడా సంపాదించడం మొదలుపెట్టాడు. ఆఫీసులోని ఫైళ్లను తారుమారు చేయడం, సంబంధిత పార్టీల నుంచి భారీగా బహుమానాలు పొందడం సంతోష్ నిత్యకృత్యంగా మారింది. సంపాదన రూ. కోట్లకు చేరింది. దీంతో సంతోష్ లగ్జరీగా బతకడం మొదలుపెట్టాడు. ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ వాటిని దర్జాగా ఇంటిముందు ప్రదర్శించుకునేవాడు. అయితే, అవినీతి ఎంతోకాలం దాగదు కదా. ఇటీవల సంతోష్ నిర్వాకం అధికారుల దృష్టికి రావడంతో కమిషనర్ విచారణకు ఆదేశించాడు. అక్రమాలు బయటపడడంతో సస్పెండ్ చేసి, పోలీస్ కేసు పెట్టారు. ప్రస్తుతం సంతోష్ బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.