సిసోడియాకు బెయిల్ రావడంపై ఆప్ నేతల భావోద్వేగం!
- పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే ఆయన చేసిన నేరమన్న రాఘవ్ చద్ధా
- చివరకు నిజం గెలిచిందంటూ సంజయ్ సింగ్ వ్యాఖ్య
- కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ కూ న్యాయం జరుగుతుందని ఆశాభావం
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్ధా స్పందిస్తూ.. సిసోడియా 530 రోజుల పాటు జైలులోనే గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు బెయిల్ వచ్చిందన్న వార్త విని యావత్ దేశం సంతోషం వ్యక్తం చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే సిసోడియా చేసిన నేరమని అన్నారు. విద్యాశాఖలో ఆయన గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చారని, ప్రతీ విద్యార్థికి మెరుగైన విద్య అందించాలని తాపత్రయపడ్డారని చెప్పారు.
సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నియంతృత్వానికి చెంపదెబ్బలాంటిదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి గత 17 నెలలుగా ఊచల వెనకే ఉండిపోయారని చెప్పారు. చివరికి ఈ రోజు నిజం గెలిచిందని, సిసోడియాకు న్యాయం జరిగిందని అన్నారు. ఇదేవిధంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ లకు కూడా త్వరలో బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.