తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం

TG cabinet approves for new ration cards
  • రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్
  • ఉత్తమ్ అధ్యక్షతన కొత్త రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ
  • రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ కేబినెట్ గురువారం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశమై... పలు నిర్ణయాలు తీసుకుంది. 

కొత్త రేషన్ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన పొంగులేటి

గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రూ.437 కోట్లు విడుదల చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో శుక్రవారం జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. క్రీడాకారులు ఈషాసింగ్, నిఖత్ జరీన్, సిరాజ్‌లకు 600 గజాల చొప్పున హైదరాబాద్‌లో ఇంటి స్థలం, నిఖత్ జరీన్, సిరాజ్‌లకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించిందన్నారు.

విధుల్లో చనిపోయిన రాజీవ్ రతన్ తనయుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం, మరో అధికారి మురళి కుమారుడికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై మళ్లీ గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపించాలని నిర్ణయించామన్నారు. నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణ, హైదరాబాద్ మూసీ సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana Cabinet
Telangana

More Telugu News