కాంగ్రెస్ మోసం చేసినందునే తెలంగాణ ప్రజలు బీజేపీని 8 సీట్లలో గెలిపించారు: బండి సంజయ్
- తెలంగాణ ప్రజలకు, బీజేపీకి విడదీయరని బంధం ఉందన్న బండి సంజయ్
- రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని విషప్రచారం చేశారని ఆగ్రహం
- కార్యకర్తల కష్టంతో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందన్న కేంద్రమంత్రి
మోదీ ప్రభుత్వం మూడోసారి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. కార్యకర్తల కష్టంతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. కార్యకర్తలు తమ భుజంపై కాషాయ జెండాను మోశారని.. వారందరికీ సెల్యూట్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందన్న రాహుల్ గాంధీపై మండిపడ్డారు.
మీ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉంది కదా? ఉస్మానియా యూనివర్శిటీలో తిరిగే దమ్ముందా? అని సవాల్ చేశారు. ఓయూకి వెళ్లి నిరుద్యోగులను కలిసి వాళ్ల సమస్యలపై మాట్లాడగలరా? అని ప్రశ్నించారు. తెలంగాణలో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి ఏడు నెలలైనా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీయే అంటువ్యాధి లాంటిదన్నారు. మోదీ రోజ్ గార్ మేళాతో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోందని... అయినప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోందని రాహుల్ గాంధీ అనడం సిగ్గుచేటు అన్నారు.