Pensions: ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి సర్వం సిద్దం

All set for NTR Bharosa Pensions distribution in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో రేపు (జులై 1) ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటు, ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు రూ.3 వేలతో కలిపి రేపు రూ.7 వేలు అందించనున్నారు. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. 

మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు చేస్తున్నారు. జులై 1న రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటుండడం విశేషం. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు చంద్రబాబు స్వయంగా పింఛను ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,20,097 మంది సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి అధికార యంత్రాంగం సమాయత్తమైంది.

మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పెంచిన పింఛను అందజేయనున్నారు. వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య కారులు, కళా కారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి ఇకపై రూ.4000 పింఛను ఇవ్వనున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ ను రూ.3000 నుంచి ఒకేసారి రూ.6000 పెంచారు. 

తీవ్ర అనారోగ్యంతో ఉండే వారికి ఇచ్చే పింఛను రూ.5000 నుంచి రూ.15000 పెంపుదల చేశారు. ఈ విభాగంలో  24,318 మంది పెన్షన్ అందుకోనున్నారు.

పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వానికి నెలకు రూ.819 కోట్ల అదనపు వ్యయం కానుంది. గడిచిన మూడు నెలలకు కలిపి పెంచిన మొత్తం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1650 కోట్ల అదనపు ఖర్చు భారం పడనుంది. గత ప్రభుత్వంలో పింఛను కోసం నెలకు రూ.1939 కోట్లు ఖర్చు అయ్యేది. కాగా, పింఛన్ల కోసం రేపు ఒక్క రోజులో  రూ.4,408 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఏడాదికి ఇకపై పింఛన్ల కోసం రూ.34 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. 
Go Back to Shorts
Pensions
NTR Bharosa
Chandrababu
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News