గెలుస్తామని చంద్రబాబు చెప్పలేక పోతున్నారు.. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని సీట్లు వైసీపీవే: సజ్జల
- చంద్రబాబు పూర్తిగా నెగెటివ్ క్యాంపెయిన్ చేశారన్న సజ్జల
- ల్యాండ్ టైట్లింగ్ పై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపాటు
- వైసీపీ ఓడిపోతుందనే భ్రమలో టీడీపీ ఉందని ఎద్దేవా
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారని సజ్జల విమర్శించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో సీసీటీవీలను పోలీసులు ధ్వంసం చేయడమేంటని ప్రశ్నించారు. పోలీసులు చేసిన దాడిపై ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నామని చెప్పారు. పోలింగ్ రోజున టీడీపీ అక్రమాలకు పాల్పడిందని... కౌంటింగ్ రోజున అక్రమాలు జరిగితే ఎదుర్కొంటామని అన్నారు. ఇప్పటికైనా ఈసీ తన తప్పును సరిదిద్దుకుంటే మంచిదని చెప్పారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
పోలింగ్ శాతం పెరిగితే వైసీపీ ఓడిపోతుందనే భ్రమలో టీడీపీ ఉందని... వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని సజ్జల చెప్పారు. ప్రజలు నమ్మడం లేదనే చంద్రబాబు సూపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదని... వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించే మాట్లాడారని... తాను చేసే మంచి గురించి మాట్లాడలేదని విమర్శించారు. జగన్ మాత్రం తాను చేసిన సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలని అడిగారని చెప్పారు.
ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని చంద్రబాబు చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ-ఆఫీసును అప్ గ్రేడ్ చేస్తుంటే... రికార్డులను మాయం చేస్తున్నారని గవర్నర్ కు పిచ్చిపిచ్చి లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని సీట్లు వైసీపీవేనని ధీమా వ్యక్తం చేశారు.