జిల్లాల పేర్లు చెప్పాలంటూ మోదీ సవాల్.. ఒడిశా సీఎం పట్నాయక్ స్పందన ఇదిగో!
- ఒడిశాకు మీరు ఇచ్చిన హామీలలో ఎన్ని గుర్తున్నాయంటూ మోదీకి కౌంటర్
- సంస్కృత భాషకు వెయ్యి కోట్లు.. ఒడియా భాషకు పైసా కూడా ఇవ్వలేదని ఫైర్
- రాష్ట్రంలో భారత రత్న అందుకునే అర్హత ఉన్న వాళ్లే కనిపించలేదా అని ప్రశ్న
- బిజూ పట్నాయక్ కు భారత రత్న ఎందుకు ప్రకటించలేదని నిలదీసిన నవీన్ పట్నాయక్
‘సంస్కృత భాష అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించిన మీరు ఒడియాకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఉన్నప్పటికీ ఒడియాను మర్చిపోయారు. ఒడిస్సీ మ్యూజిక్ కు క్లాసికల్ హోదా కోసం తాను రెండు సార్లు ప్రతిపాదనలు పంపినా వాటిని బుట్టదాఖలు చేశారు. ఒడిశాలో ఎంతోమంది గొప్పవాళ్లు, మహానుభావులు ఉన్నారు. వారిలో కొందరి పేర్లను మీరు కూడా మీ ప్రసంగంలో ప్రస్తావించారు. అలాంటి మహనీయులు భారత రత్నకు అర్హులు కారా? ఒడిశా పుత్రుడు బిజూ పట్నాయక్ కు భారత రత్న పొందే అర్హత లేదా?. ఎన్నికల సమయంలోనే ఒడిశాను గుర్తుచేసుకోవడం వల్ల మా రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు. 2014 - 2019 మధ్య కాలంలో మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా? గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తానని, జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని.. ఇలా మీరు ఇచ్చిన హామీలు ఎలా మర్చిపోయారు?’ అంటూ మోదీపై నవీన్ పట్నాయక్ విరుచుకుపడ్డారు.