Amit Shah: ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం: అమిత్ షా హామీ

Amit Shah says will give reservations to SC ST and BC
షార్ట్స్‌లో చూడండి
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం చెప్పినట్లుగా మతపరమైన రాజకీయాకు తాము వ్యతిరేకమని, ముస్లింలకు రిజర్వేషన్లను తొలగించి... వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీకు ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భువనగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. అందుకే అబద్దాలు చెప్పి గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. తాము పదేళ్లుగా పూర్తి మెజార్టీలో ఉన్నా రిజర్వేషన్లు తీసివేయలేదని గుర్తించాలన్నారు. తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ అని... ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇస్తామని హామీ ఇచ్చారు.

రాహుల్ గాంధీ గ్యారెంటీ ఇస్తే సాయంత్రానికి అంతా అయిపోతుందని ఎద్దేవా చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ, రూ.12 వేల రైతు కూలీ, విద్యార్థినులకు స్కూటీ వంటి హామీలు నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఏళ్ల పాటు అడ్డుకుందని ఆరోపించారు. మోదీ హయాంలో రామాలయం పూర్తి చేశామన్నారు. రాజస్థాన్, తెలంగాణ ప్రజలకు కశ్మీర్‌తో ఏం పని అని మల్లికార్జున ఖర్గే అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ కోసం భువనగిరి వాసులు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేసి మోదీ కశ్మీర్ మనదేనని చాటారన్నారు.

కేంద్రంలో బీజేపీ వచ్చాక ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని రూపుమాపామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్‌ను నిలువరించగలవా? అని ప్రశ్నించారు. ఎ అంటే అక్బరుద్దీన్, బీ ఆంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్... ఇవన్నీ ఒక్కటేనని విమర్శించారు. ఈ మూడు పార్టీలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోందని మండిపడ్డారు. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్టను కాంగ్రెస్ బహిష్కరించిందని గుర్తు చేశారు. మోదీ జాతీయ టెక్స్ టైల్ విధానాన్ని తీసుకు వచ్చారని, రూ.14వేల కోట్లతో పోచంపల్లి టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారన్నారు. బీబీ నగర్‌లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు.
Go Back to Shorts
Amit Shah
BJP
Telangana
Jammu And Kashmir
Ayodhya Ram Mandir

More Telugu News