‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వసూళ్లకంటే ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లు మించిపోయాయి: మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వసూళ్లకంటే ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లు మించిపోయాయి: మోదీ

PM Modi Election Campaign Speech At Vemulawada Sabha
  • వేములవాడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని
  • తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చానని వ్యాఖ్య
  • రాజన్న దర్శనం తర్వాత సభ ప్రాంగణానికి రాక
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర విమర్శలు
  • బండి సంజయ్ గెలుపు ఎప్పుడో ఖరారైపోయిందని ధీమా
తెలంగాణలో మార్పు తీసుకొస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. అవినీతిలో గత ప్రభుత్వాన్నే అనుసరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్లకంటే రాష్ట్రంలో ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వసూళ్లే మించిపోయాయని ఆరోపించారు. కాంగ్రెస్ తీరుపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం నెలకొందని చెప్పారు. ప్రజలు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపెడుతున్నారని, ఇప్పటి వరకు జరిగిన మూడు దశల లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవమే ఎదురైందని చెప్పారు. మిగతా నాలుగు దశలలోనూ ఆ పార్టీకి ఓట్లు రాలవని చెప్పారు. బీజేపీ, ఎన్డీయే కూటమిని గెలిపించుకోవాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు. 

కరీంనగర్‌ లో బండి సంజయ్‌ గెలుపు ఖరారైందని చెప్పారు. ఈమేరకు బుధవారం వేములవాడలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. బుధవారం ఉదయమే వేములవాడ చేరుకున్న ప్రధాని.. ముందుగా రాజరాజేశ్వరుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి భారీగా వచ్చిన జనం ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.

మీ ఓటుతోనే భారత్ అభివృద్ధి..
ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడానికి గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మీరు వేసిన ఓటే కారణమని మోదీ చెప్పారు. బీజేపీకి రెండు పర్యాయాలు మీరు ఇచ్చిన అవకాశం వల్లే ఇప్పుడు దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని వివరించారు. ఈ క్రమంలోనే మరోసారి మీ ఆశీర్వాదం కోరేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తే తమ కలలు సాకారమవుతాయని ప్రజలు భావించారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రయోజనాలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాల కోసమే పనిచేసిందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన పని కూడా ఇదేనని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలేనని, వాటికి కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. అవి రెండూ ఒకే నాణేనికి ఉన్న బొమ్మాబొరుసులాంటి వని చెప్పారు. బీజేపీ మాత్రమే దేశానికి తొలి ప్రాధాన్యం ఇస్తుందని వివరించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభావం మచ్చుకు కూడా కనిపించడంలేదని, కాంగ్రెస్ పార్టీ అడ్రసు కూడా ఈ ఎన్నికల్లో గల్లంతవుతుందని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ లది ఫెవికాల్ బంధం..
అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, వాటి మధ్య ఫెవికాల్ బంధం ఉందని మోదీ విమర్శించారు. తెర ముందు ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు, తెరవెనుక మాత్రం సిండికేట్ గా మారతారని మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాఫ్తు జరిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Narendra Modi
Vemulawada
BJP Campaign
Lok Sabha Polls
RR Tax
RRR

More Telugu News