భూమి మనిషికి చెందదు.. అడవులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాల్సిందే: సుప్రీంకోర్టు
- వరంగల్ జిల్లాలో అటవీ భూమిని కొట్టేయాలనుకున్న ఓ వ్యక్తి కేసులో కీలక తీర్పు
- సరైన వైఖరి తీసుకోనందుకు తెలంగాణ ప్రభుత్వానికి రూ. 5 లక్షల జరిమానా
- పర్యావరణ పరిరక్షణ, పౌరుల జీవించే హక్కుకు మధ్య నేరుగా సంబంధం ఉందని వ్యాఖ్య
రెండు నెలల వ్యవధిలో రెండో తీర్పు..
ఈ విషయంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు వెళ్లిన జడ్జి సరైన తీర్పు ఇవ్వగా దాన్ని రాష్ర్ట విభజన అనంతరం తెలంగాణ హైకోర్టుకు చెందిన జడ్జి కొట్టేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ సందర్భంగా 1854లో ఓ గిరిజన తెగ పెద్ద నాటి అమెరికా అధ్యక్షుడికి రాసిన లేఖను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది.
“భూమి మనిషికి చెందదు. మనిషే భూమికి చెందిన వాడు” అంటూ ఆ లేఖలో గిరిజన తెగ పెద్ద పేర్కొనడాన్ని గుర్తుచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ(జీ) ప్రకారం అడవులు, సరస్సులు, నదులు, అడవి జంతువులతో కూడిన సహజ పర్యావరణాన్ని కాపాడటం, మెరుగుపరచడం పౌరుల ప్రాథమిక బాధ్యతని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణను ప్రాథమిక హక్కులకు సమాన స్థాయిలో పోలుస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం గత రెండు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. అంతరించి పోయే దశలో ఉన్న బట్టమేక పిట్ట పరిరక్షణ విషయంలో సుప్రీంకోర్టు గత నెల పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని తెలియజేస్తూ తీర్పు వెలువరించింది.