ఉచిత విద్యుత్ ప‌థ‌కంపై సీఏం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉచిత విద్యుత్ ప‌థ‌కంపై సీఏం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ‌

BRS Leader Harish Rao wrote a letter to CM Revanth Reddy
  • ప్ర‌భుత్వ పొర‌పాటు వ‌ల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతోందన్న హరీశ్ 
  • కేవలం 30 లక్షల మందికి మాత్రమే ప‌థ‌కం వ‌ర్తింపజేశారని విమర్శ  
  • బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని సూచ‌న‌  
నిరుపేదలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం అమలు విషయంలో జరుగుతున్న పొరపాటుల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు లేఖ రాశారు. ఈ ప్రభుత్వ పథకంలో జరుగుతున్న పొరపాటు వల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని హ‌రీశ్ రావు ఈ సంద‌ర్భంగా సీఏం దృష్టికి తీసుకెళ్లారు. కేవలం 200 యూనిట్ల వరకు వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్ ఇస్తున్నారు. కానీ, ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా సరే, మొత్తం 201 యూనిట్లకు బిల్ వసూలు చేస్తున్నారని ఆయ‌న తెలిపారు. ఈ విధానం వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని గుర్తు చేశారు. 
 
అలాగే వినియోగదారులు ప్రతీ రోజు పొద్దున లేచి తాము ఎంత కరెంటు కాలుస్తున్నాము? మీటర్ ఎంత తిరుగుతుంది? అనేది గమనించుకోవాల్సిన పరిస్థితి దాపురించింద‌న్నారు. కాబట్టి 200 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు వాడినప్పటికీ, పై యూనిట్లకు మాత్రమే బిల్లు వేసే విధంగా నిబంధనలు రూపొందించాలని కోరారు. ఒక‌వేళ 200 యూనిట్లు దాటితే.. 200 యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించి, మిగతా యూనిట్ల ధరను వినియోగదారుడు చెల్లించే విధంగా బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని హ‌రీశ్ రావు సూచించారు. అంతేగాక రాష్ట్ర‌వ్యాప్తంగా 90 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులుంటే.. ప్రభుత్వం కేవలం 30 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. మిగతా 60 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. 

ఇక హైదరాబాద్ నగరంలో కూడా 30 లక్షల మంది పేదలుంటే, కేవలం 10 లక్షల మందికే పథకం అమలు చేయాలని నిర్ణయించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని అన్నారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యం వ‌ల్ల‌ మిగతా వారికి నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. అటు ఒక రేషన్ కార్డు కింద ఒక కుటుంబాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవ‌డం వ‌ల్ల కూడా పేద కుటుంబాల‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని తెలిపారు. ఒక రేషన్ కార్డులో పేర్లున్న వారు రెండు మూడు కుటుంబాలుగా కూడా విడిపోయి ఉంటున్నారు. వారు ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో, వేర్వేరు అంతస్తుల్లో ఉంటున్నారు. కానీ ప్రభుత్వం వారందరినీ ఒకే కుటుంబంగా లెక్క కట్టి ఒక్కరికే పథకం వర్తింప చేస్తుంది. ఇది కూడా సరైన పద్ధతి కాద‌న్నారు. ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని హ‌రీశ్ రావు కోరారు. నిజమైన పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమైతే మాత్రం మొత్తం 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ది కలిగేలా చేయాలని సూచించారు.
Advertisement
Harish Rao
Revanth Reddy
BRS
Congress
Telangana

More Telugu News