భారత్ కు వ్యతిరేకంగా మద్దతివ్వలేం.. పాక్ కు తేల్చి చెప్పిన జిన్ పింగ్
- బాలాకోట్ స్ట్రయిక్స్ తదనంతర పరిస్థితులపై సంచలన విషయాలు వెలుగులోకి
- భారత్, పాక్ మధ్య దౌత్య సంబంధాలపై మాజీ దౌత్యవేత్త అజయ్ బిసారియా పుస్తకం
- అప్పట్లో పాకిస్థాన్ లో భారత హైకమిషనర్ గా పనిచేసిన బిసారియా
పాకిస్థాన్ సైన్యానికి బందీగా చిక్కిన మన ఎయిర్ ఫోర్స్ వారియర్ అభినందన్ వర్ధమాన్ ను వెనక్కి తీసుకురావడానికి విమానం పంపేందుకు భారత ప్రభుత్వం సిద్ధపడగా.. ఆ విమానాన్ని పాక్ అనుమతించలేదని అజయ్ బిసారియా చెప్పారు. దీంతో అప్పటికే నెలకొన్న ఉద్రిక్తత మరింత తీవ్రమైందని వివరించారు. ఆపై పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్ మినా జన్ జువాకు సైనిక అధికారుల నుంచి కీలక సందేశం అందిందని తెలిపారు. సరిహద్దుల్లో భారత సైన్యం తొమ్మిది క్షిపణులను పాక్ వైపు గురిపెట్టిందని, ఏ క్షణమైనా వాటిని పేల్చే అవకాశం ఉందనేదే ఈ సందేశమని బిసారియా చెప్పారు.
దీంతో జన్ జువా అప్రమత్తమయ్యారని, ఈ సందేశాన్ని అమెరికా, యూకే, ఫ్రాన్స్ రాయబారులకు చేరవేసి మీమీ దేశాలకు తెలియజేసి, భారత్ కు సర్దిచెప్పాలని ఆమె కోరారన్నారు. ఈ విషయంపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంప్రదింపులు జరిపారని అజయ్ బిసారియా తెలిపారు. అయితే, ఇందులో పాక్ తరఫున నిలబడేందుకు జిన్ పింగ్ నిరాకరించారని, భారత్ అమెరికాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం గుర్తుచేస్తూ అగ్రరాజ్యంతో సంప్రదింపులు జరపాలంటూ ఇమ్రాన్ కు ఆయన సూచించారని తెలిపారు.