11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించారు: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన వస్తోందన్న సజ్జనార్
- ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే ఉన్నారని వెల్లడి
- ప్రతిరోజు సగటున 30 లక్షలమంది మహిళలు రాకపోకలు సాగించినట్లు వెల్లడి
మహిళల ఉచిత ప్రయాణ పథకం ఫలితంగా సంస్థ ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. గతంలో 69 శాతం ఓఆర్ ఉండగా.. ప్రస్తుతం అది 88 శాతానికి పెరిగిందన్నారు. ఈ నెల 16వ తేదీన 17 డిపోలు, 17వ తేదీన 20 డిపోలు, 18వ తేదీన 45 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ నమోదయినట్లు వెల్లడించారు. గత మూడ్రోజుల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుజూరాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్-2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100 శాతం ఓఆర్ సాధించినట్లు తెలిపారు.
త్వరలో 2050 కొత్త బస్సులు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు సజ్జనార్ వెల్లడించారు. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో దాదాపు 2050 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అందులో 1050 డీజిల్.. 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని, విడతల వారీగా ఆ బస్సులను ఉపయోగంలోకి తీసుకువస్తామని ట్వీట్‌లో పేర్కొన్నారు.