Revanth Reddy: కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో తండ్రికి చలిజ్వరం వస్తే, కొడుక్కి మతి తప్పినట్టుంది: రేవంత్ రెడ్డి

Revanth Reddy gives strong reply to KTR
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ కాంగ్రెస్ కు ఎన్నికల నిధులు సమకూర్చేందుకు కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరులోని బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు రూ.500 చొప్పున వసూలు చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించడం తెలిసిందే. 

పాత అలవాట్లు చచ్చినా వదలవని, స్కాంలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ ఘనచరిత్ర గురించి అందరికీ తెలిసిందేనని, అందుకే కాంగ్రెస్ ను 'స్కాం'గ్రెస్ అంటున్నానని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 

నిండా అవినీతిలో మునిగిపోయి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది? అని మండిపడ్డారు. పక్కరాష్ట్రంపై నీ గాలి మాటలు కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో మీ కల్వకుంట్ల SCAMILY గురించి చెప్పు అంటూ వ్యాఖ్యానించారు.

"దళితబంధులో 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నట్టు స్వయంగా మీ అయ్యనే ఒప్పుకున్న సంగతి చెప్పు. లిక్కర్ స్కాంలో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసుకుందని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు. భూములు, మద్యం అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడవడంలేదని కాగ్ కడిగేసిన విషయం చెప్పు. 

తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నారో, ఎన్ని ఎకరాలను మీ రియల్ ఎస్టేల్ మాఫియాకు కట్టబెట్టారో, ఎంతమంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారో, ఎన్ని లక్షల చదరపు అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయో అన్నీ లెక్కలతో సహా తేలుస్తాం. కాంగ్రెస్ ను అడ్డుకోవడం నీ వల్ల కాదు, నీ అయ్య వల్ల కూడా కాదు" అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను చూసి తండ్రికి చలిజ్వరం వస్తే, కొడుక్కేమో పూర్తిగా మతి తప్పినట్టుగా ఉందని రేవంత్ వ్యంగ్యం ప్రదర్శించారు.
Go Back to Shorts
Revanth Reddy
KTR
Congress
KCR
BRS
Telangana

More Telugu News