పెళ్లి వేడుకలో 7 ఏళ్ల బాలుడి అనుమానాస్పద మృతి

7 year old boy dies in mysterious circumstance in Hyderabad body recovered from water tank
  • శంషాబాద్‌లోని ఆర్‌జీఐఏ ఠాణా పరిధిలో బుధవారం ఘటన
  • ఓ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు నందిగామ నుంచి వచ్చిన కుటుంబం
  • పెళ్లి మండపంలో డ్యాన్స్‌తో బాలుడి సందడి, ఆపై అనూహ్యంగా అదృశ్యం
  • పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు
  • ఫంక్షన్ హాల్‌ వెనకున్న నీటిసంపులో బాలుడి మృతదేహం గుర్తింపు
  • హాల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే బాలుడు అకాలమరణం చెందాడంటూ తల్లిదండ్రుల ఆందోళన
తల్లిదండ్రులతో కలిసి ఓ ఏడేళ్ల చిన్నారి బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లిలో తన డ్యాన్స్‌తో సందడి చేశాడు. ఆ తరువాత కొద్దిసేపటికే అదృశ్యమైన అతడు చివరకు ఫంక్షన్‌హాల్ వెనకున్న నీటి ట్యాంక్‌లో పడి మరణించాడు. శంషాబాద్‌లో ఆర్‌జీఐఏ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన పెళ్లి వేడుకలో విషాదం నింపింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే, నందిగామకు చెందిన శ్రీకాంత్ రెడ్డి తన కుమారుడు అభిజిత్ రెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి బుధవారం శంషాబాద్‌లో ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న పెళ్లి వేడుకకు వచ్చారు. ఈ సందర్భంగా అభిజిత్ రెడ్డి మండపం వద్ద దాండియా ఆడుతూ సందడి చేశాడు. పెళ్లి హడావుడిపై పడిపోయిన అతడి తల్లిదండ్రులు కాసేపటి తరువాత అభిజిత్ అదృశ్యమైనట్టు గుర్తించి తల్లడిల్లిపోయారు. అంతటా విచారించినా బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రంగంలోకి దిగిన పోలీసులు పలు కోణాల్లో విచారిస్తూ సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలించారు. ఈ క్రమంలో ఫంక్షన్ హాల్‌ వెనక తెరిచి ఉన్న నీటిసంపులో చూడగా బాలుడి శవం కనిపించింది. దీంతో, పెళ్లివేడుకలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు, ఫంక్షన్ హాల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడంటూ బంధువులు, స్నేహితులు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. ఈ కేసులో న్యాయం చేస్తామంటూ పోలీసులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా బాలుడి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫంక్షన్ హాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
Hyderabad
Shamshabad
Crime News

More Telugu News