నేచురల్ వాష్ బేసిన్ చూశారా..? ఇదిగో..!
- వెదురుతో చేసిన వాష్ బేసిన్
- నాగాలాండ్ గ్రామాల్లోని ఇళ్లల్లో ఇది సాధారణం
- వీడియోని పంచుకున్న నాగాలాండ్ మంత్రి తెంజెన్
ఈ విడత నాగాలాండ్ మంత్రి వెదురుతో చేసిన టాప్ కమ్ వాష్ బేసిన్ వీడియోని పరిచయం చేశారు. మీరు ఇలాంటిది ఎక్కడైనా చూశారా? అంటూ ఆయన నెటిజన్లకు ప్రశ్న సంధించారు. నాగాలాండ్ కు వెళితే చాలా గ్రామాల్లో ఇవి కనిపిస్తాయి. అక్కడ వెదురు బొంగులనే పైపులుగా ఉపయోగిస్తుంటారు. కొండల పై నుంచి పారే నీరు అక్కడి వారికి ఆధారం. వెదురు బొంగుకు మధ్యలో తొర్ర పెట్టి, దాన్ని నీటితో నింపుతారు. పక్కవైపున ట్యాప్ మాదిరిగా చిన్న చిల్లులు పెట్టి చిన్న స్టిక్ తో వాటిని మూసివేస్తారు. చేతులు కడుక్కోవాల్సి వచ్చినప్పుడల్లా ఆ పుల్ల బయటకు లాగడం, వాడుకున్న తర్వాత దాంతో తిరిగి మూసేయడం చేస్తుంటారు. వెదురుతో ఇళ్ల నిర్మాణం, సోఫా, గృహ వినియోగ వస్తువులు సహా ఎన్నింటినో తయారు చేస్తుంటారని తెలిసిందే. ప్రకృతి అనుకూలంగా ఏది చేసినా అది సానుకూల ప్రభావం చూపిస్తుందని చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం.