కేసీఆర్ గారూ! అలా చేసి పిట్టలదొరను కాదని నిరూపించుకోండి: షర్మిల
- తెలంగాణలో దొరగారికి ఎన్నికల ముందు హామీలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా
- రైతుల ఓట్లు అడగలేక రుణమాఫీ అంటూ నక్క వినయమని విమర్శ
- నాలుగున్నరేళ్లుగా తెలంగాణ సొమ్మంతా దోచుకోవడం, దాచుకోవడానికే సరిపోయిందని ఆరోపణ
- జనాలకు మద్యం తాగించి ఆ సొమ్ముతో రుణమాఫీ చేస్తాడట అని నిప్పులు
- దళిత బంధు, మైనార్టీ బంధును అమలు చేయాలని సూచన
బీఆర్ఎస్ బందిపోట్లకు నాలుగున్నరేళ్లుగా తెలంగాణ సొమ్మంతా దోచుకోవడం, దాచుకోవడానికే సరిపోయిందని, ఇక మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయని ప్రశ్నించారు. రుణమాఫీకి డబ్బుల్లేక నవంబర్‌లో రావాల్సిన మద్యం టెండర్లను మూడు నెలల ముందుకు తీసుకు వచ్చాడన్నారు. జనాలకు మద్యం తాగించి... ఆ వచ్చిన సొమ్ముతో రుణమాఫీ చేస్తాడట అని నిప్పులు చెరిగారు. సిగ్గుందా ముఖ్యమంత్రి గారు? ధరలు పెంచి, పన్నులు పెంచి ప్రజల రక్తం తాగడం చాలదని, మద్యం తాగించి, మహిళల మంగళసూత్రాలు తెంపి, జనాలను మద్యానికి బానిస చేసి ఓట్లు దండుకోవడమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా సమయంలోనూ రాష్ట్రం ఆర్థికంగా దూసుకెళ్లిందని, నిధుల కొరత లేదని ఇన్నాళ్లూ గప్పాలు కొట్టిన దొర, ఇప్పుడు రుణమాఫీ చేయడానికి కరోనా అడ్డు తగిలిందట అని నిప్పులు చెరిగారు. ఇవి చాలదన్నట్లు ఔటర్ రింగ్ రోడ్డును అతి తక్కువ ధరకు రూ.7 వేల కోట్లకే లీజుకు ఇచ్చారన్నారు. ప్రభుత్వ భూములను యథేచ్చగా అమ్ముకుంటున్నారని, ఎన్నికల కోసం ప్రణాళికతో డబ్బును పోగు చేసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏం చేసినా ఎన్నికల కోసమే చేస్తాడనే మాటను నిలబెట్టుకున్నాడన్నారు. ఈ పిట్టల దొర ముచ్చట సొంత పార్టీ ఎమ్మెల్యేలూ నమ్మరన్నారు.
ఓట్ల కోసమైనా ఇచ్చిన హామీలు గుర్తు చేసుకుంటున్న దొర గారు.. అదే చేతితో డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, చట్ట సభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. నిలిచిపోయిన దళిత బంధును, మైనార్టీ బంధును అమలు చేయాలన్నారు. బీసీల్లోని అన్ని కులాలకు బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందే రెండు దఫాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి, మీరు పిట్టల దొర కాదని నిరూపించుకోవాలని హితవు పలికారు.