I-N-D-I-A కూటమిలో ప్రధాని పదవి కోసం కాలుపట్టి గుంజుతారు: కిషన్ రెడ్డి
- ఎంతమంది కేసీఆర్, ఒవైసీ, రాహుల్ గాంధీలు వచ్చినా 2024లో మోదీని అడ్డుకోలేరని వ్యాఖ్య
- తెలంగాణలో బుల్డోజర్ పాలన రావాలన్న కిషన్ రెడ్డి
- నిజాం భవనాలను తలపించేలా ప్రగతి భవన్ కట్టుకున్నారని వ్యాఖ్య
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, పార్టీ కార్యాలయం కోసం పది ఎకరాలు ఇచ్చింది ఎవరు? తీసుకున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీని మించి బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందన్నారు. తాము ఏ పార్టీతోనే కలిసేది లేదని స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల తరఫున బీజేపీ యుద్ధం చేస్తుందని, మేం తెలంగాణలో ఒక్క అడుగు వెనుకకు వేశామంటే పది అడుగులు ముందుకేస్తామన్నారు.
మరోపక్క, ఇటీవల ఏర్పడిన I-N-D-I-A కూటమిపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పార్టీలలో ప్రధానమంత్రి ఎవరు అవుతారో తెలియదన్నారు. ఆ కూటమి అధికారంలోకి వస్తే మూడు నెలలకో ప్రధానమంత్రి మారుతారని ఎద్దేవా చేశారు. ఎవరినీ ఆ కుర్చీలో కూర్చోనివ్వరని, ఒకరు కాలు పట్టి గుంజితే, మరొకరు చేయిపట్టి లాగుతారన్నారు. ప్రజలు సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.