BRS: యూట్యూబ్ చానల్ కెమెరామన్‌పై దాడిచేసి, నోరు పారేసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి

  • వరుస వివాదాల్లో పాడి కౌశిక్‌రెడ్డి
  • మొన్న రైతుపై, ఇప్పుడు యూట్యూబ్ చానల్ కెమెరామన్‌పై
  • సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆడియో
  • ఎమ్మెల్సీ నుంచి ప్రాణహాని ఉందన్న బాధితుడు
  • తప్పుడు ఆరోపణలన్న ఎమ్మెల్సీ
BRS MLC Padi Kaushik Reddy Lands In Another Controversy

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రైతు దినోత్సవం రోజున రైతును దూషించి వార్తల్లోకి ఎక్కిన ఆయన తాజాగా హుజూరాబాద్‌లో ఓ యూట్యూబ్ కెమెరామన్‌ను బూతులు తిడుతున్న ఆడియో వైరల్ అవుతోంది. కౌశిక్‌రెడ్డితో తనకు ప్రాణహాని ఉందంటూ బాధితుడు అజయ్ నిన్న మధ్యాహ్నం ఓ వీడియోను విడుదల చేశాడు.

కులం పేరుతో దూషించారు
గురువారం తాను హుజూరాబాద్‌లో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లానని, అక్కడ ఓ మహిళ ఎమ్మెల్సీని ఏదో అడుగుతుండగా కవర్ చేసేందుకు తాను అటువైపు వెళ్లానని పేర్కొన్నాడు. అది చూసిన కౌశిక్‌రెడ్డి అనుచరులు వీడియో తీస్తున్న తన సెల్‌ఫోన్‌ను లాగేసుకున్నారని, అది తెచ్చుకునేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అక్కడ తనపై దాడిచేసి కులం పేరుతో దూషించారని అజయ్ ఆరోపించాడు. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు.

నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
అజయ్ ఆరోపణలపై కౌశిక్‌రెడ్డి స్పందించారు. అదంతా తప్పుడు ప్రచారమేనని ఖండించారు. ఆరోపణలు నిరూపిస్తే ముక్కును నేలకు రాస్తానని చెప్పారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఇద్దరు ముగ్గురు మీడియా బ్రోకర్లు కలిసి గురువారం తనపై అనేక తప్పుడు అరోపణలు చేశారని అన్నారు. తాను ముదిరాజ్‌లకు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని కౌశిక్‌రెడ్డి వాపోయారు.

More Telugu News