వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తా: యువకుడిపై నయనతార ఫైర్
- హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తంజావూరులోని కులదైవం ఆలయాన్ని సందర్శించిన నయన్
- భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు
- వారిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు
- తిరిగి వెళ్లిపోతున్న సమయంలో ఓ అభిమాని అత్యుత్సాహంపై నయన్ అసహనం
అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు తరలి రావడంతో స్పందించిన విఘ్నేశ్ శివన్ వారికి అభివాదం చేసి తమను ప్రశాంతంగా పూజలు చేసుకోనివ్వాలని కోరారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో తోపులాట జరిగింది. దీంతో నయన్ పూజ అనంతరం బయటకు వచ్చేసి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా అక్కడ అభిమానులతో ఫొటోలు కూడా దిగారు.
అనంతరం అక్కడి నుంచి రైలులో తిరిగి బయలుదేరారు. అయితే, నయన్ రైలులోకి ఎక్కిన వెంటనే ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. ఆమెతో సెల్ఫీ వీడియో తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్పటికే కోపంగా ఉన్న నయన్.. వీడియో తీయడం ఆపకుంటే ఫోన్ పగలగొట్టేస్తానని హెచ్చరించారు.