దుర్మార్గపు సంస్థ క్యూనెట్.. స్వప్నలోక్ అగ్నిప్రమాదంలో దాని పాత్రపై సమగ్ర విచారణ జరగాలి: సజ్జనార్
- అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు ఈ సంస్థ ఉద్యోగులే
- మల్టీలెవెల్ మార్కెటింగ్ నిర్మహించే మోసపూరిత సంస్థ క్యూ నెట్ అన్న సజ్జనార్
- గతంలోనూ ఆ సంస్థపై అనేక కేసులు ఉన్నాయని వెల్లడించిన టీఎస్ ఆర్టీసీ ఎండీ
‘భారీ డబ్బును ఆశచూపి అమాయకులను మోసం చేస్తున్న క్యూనెట్ బాగోతం ఈ అగ్నిప్రమాదంతో మరోసారి బయటపడింది. క్యూనెట్ అమాయకులైన ఆరుగురిని పొట్టనబెట్టుకుంది. ఆ కాంప్లెక్స్‌లో బీఎం5 సంస్థ పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తూ, తెరవెనక క్యూనెట్ ఎంఎల్‌ఎం దందా సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 40 మందిపైగా యువతీయువకులు అక్కడ పని చేస్తున్నట్లున్నారు. క్యూనెట్ ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.1.50-3 లక్షలు కట్టించుకున్నట్లు మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు.
అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మోసపూరిత ఎంఎల్‌ఎం సంస్థల మాయలో పడవద్దని యువతకు సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి మోసపూరిత సంస్థల విషయంలో భవన యాజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భవన యజమానులు అధిక అద్దెకు ఆశపడి.. ఇలాంటి మోసాలకు బాధ్యులు కావొద్దన్నారు.