‘అయ్యో..’ అంటూ మోదీ పలకరింపు.. మురిసిపోయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘అయ్యో..’ అంటూ మోదీ పలకరింపు.. మురిసిపోయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్

Comedian Whose Mass Layoff Video Went Viral Meets PM Modi
  • ప్రధాని మోదీని కలుసుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రద్ధ జైన్
  • తనను అయ్యో అని పలకరించారంటూ సంబరపడ్డ యువతి
  • ‘అయ్యో శ్రద్ధ’గా ఆమెకు సోషల్ మీడియాలో మంచి పాప్యులారిటీ
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రద్ధ జైన్..  ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానితో దిగిన ఫొటోను ఆమె తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. తనను చూసిన వెంటనే ప్రధాని ‘అయ్యో’ అని పలకరించారంటూ ఆమె ఉబ్బితబ్బిబ్బయ్యారు. 

సోషల్ మీడియాలో ‘అయ్యో.. శ్రధ్ధ’గా  ఆమె బాగా పాప్యులర్ . బెంగళూరులో నివసించే ఆమెకు 83 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల టెక్ రంగంలో తొలగింపుల పర్వంపై ఆమె చేసిన సెటైరికల్ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంక స్వయంగా ఈ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు. కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులూ ఒకే కుటుంబమంటూ ఊదరగొట్టే కార్పొరేట్లు ఉన్నట్టుండి సిబ్బందిని తొలగించాయంటూ ఆమె అప్పట్లో వేసిన పంచ్‌లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

ప్రధాని మోదీని కలుసుకోవడంపై శ్రద్ధ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అయ్యింది. ‘‘అందరికీ.. నమస్కారం.. అవును.. నేను భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలుసుకున్నాను. నన్ను చూడగానే ఆయన అయ్యో అంటూ పలకరించారు..! దీంతో.. నాకు క్షణకాలం పాటు నోటమాట రాలేదు...రెప్ప కూడా వేయకుండా అలాగే చూస్తుండిపోయాను ’’ అని ఆమె పేర్కొన్నారు. ప్రధానితో తాను దిగిన ఫొటోతో పాటూ.. ఇతర కన్నడ యాక్టర్లు ప్రధానితో కలిసి దిగిన ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు. భారతదేశ సౌందర్యాన్ని దక్షిణ భారత సినీరంగం చిత్రీకరిస్తున్న తీరు గర్వకారణమని ప్రధాని వ్యాఖ్యానించినట్టు ఆమె తెలిపారు. 

శ్రద్ధకు దక్కిన అరుదైన అవకాశంపై ఆమె అభిమానులూ హర్షం వ్యక్తం చేశారు. ‘‘మేము కూడా నీకు ఓ ‘అయ్యో’ వేసుకుంటున్నాం’’ అంటూ సరదా కామెంట్స్ చేశారు. ‘‘ప్రధానిని కలుసుకున్నావంటే ..  రాష్ట్రంలోని ప్రముఖుల్లో ఒకరిగా మారావన్న మాట’’ అని శ్రద్ధను ఉద్దేశించి మరికొందరు వ్యాఖ్యానించారు.
Advertisement
Narendra Modi

More Telugu News