విజయవాడ కార్యక్రమంలో రోజా స్వయంగా డ్యాన్స్ చేయడంలో అర్థముందా?: మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ
- ఏం ఉద్ధరించారని జగన్ పుట్టినరోజు వేడుకలని ప్రశ్నించిన రామకృష్ణ
- విద్యార్థులతో బలవంతంగా రక్తదానం చేయించారని మండిపాటు
- రాష్ట్రంలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని విమర్శ
జగన్ పుట్టినరోజు వేడుకలకు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పుట్టినరోజు వేడుకలకు సాంస్కృతిక, క్రీడాశాఖలు రూ. 2.50 కోట్లు వెచ్చించాయని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి రోజా స్వయంగా డ్యాన్స్ చేయడంలో అర్థమేముందని ప్రశ్నించారు. దివంగత ఎన్టీఆర్ పుట్టినరోజున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తారని... జగన్ పుట్టినరోజు నేపథ్యంలో జేఎన్టీయూ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో బలవంతంగా రక్తదానం చేయించారని విమర్శించారు.
2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేశారని అన్నారు. రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని జగన్ పుట్టినరోజు సంబరాలు? అని ప్రశ్నించారు. పోలీసులను ఉపయోగించి కేసులు పెడుతున్నారని... అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అశోక్ బాబులాంటివారిని అరెస్టు చేసి ఏం సాధించారని అడిగారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిధులను జగన్ పుట్టినరోజుకు వాడకుండా ఉండాలని కోరుతున్నానని చెప్పారు.