ట్విట్టర్‌కు షాకిచ్చేందుకు ఉద్యోగుల రెడీ.. కంపెనీ వీడనున్న వందలాదిమంది!
- ట్విట్టర్‌లో గందరగోళ పరిస్థితులు
- సంస్థను వీడేందుకు మొగ్గు చూపుతున్న ఉద్యోగులు
- మస్క్ అల్టిమేటంతో ఉద్యోగుల కఠిన నిర్ణయం
వర్క్ ప్లేస్ యాప్ ‘బ్లైండ్’ నిర్వహించిన పోల్‌లో 180 మంది ఉద్యోగుల్లో 42 శాతం మంది సంస్థను వదిలివెళ్లేందుకే మొగ్గు చూపారు. పావువంతు మంది మాత్రం అయిష్టంగానే కొనసాగేందుకు ఇష్టపడగా 7 శాతం మంది సంస్థను అంటిపెట్టుకుని ఉండేందుకే ఓటు వేశారు.
సంస్థలో ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు ఉద్యోగులను కలిసిన మస్క్ వారిని సంస్థలో ఉండమని ఒప్పించేందుకు ప్రయత్నించినట్టు ఇటీవల సంస్థను వీడి ఉద్యోగులతో టచ్‌లో ఉన్న మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు. కంపెనీని అంటిపెట్టుకుని ఉండేది ఎందరన్న విషయంలో స్పష్టత లేకున్నప్పటికీ, తొందరపడి ఉద్యోగులను తొలగించాలనుకోవడం, ఎక్కువ పనిగంటలు పనిచేసేలా ఒత్తిడి తీసుకురావడం వంటి కారణాలతో కంపెనీలో కొనసాగేందుకు ఎక్కుమంది ఉద్యోగులు విముఖత చూపుతున్నారు.
ఉద్యోగులు పెద్దమొత్తంలో కంపెనీని వీడాలనుకుంటున్నట్టు వార్తలు రావడంతో సోమవారం వరకు కార్యాలయాలను మూసివేసి బ్యాడ్జ్ యాక్సెస్ తగ్గించనున్నట్టు కంపెనీ నుంచి ఉద్యోగులకు సమాచారం అందింది.