అయ్యన్న రిమాండ్ కు విశాఖ కోర్టు తిరస్కరణ.. అయ్యన్న, రాజేశ్ లకు బెయిల్ మంజూరు
- 2 సెంట్ల భూమిని ఆక్రమించారంటూ అయ్యన్నపై కేసు
- అయ్యన్నతో పాటు ఆయన కుమారుడిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు
- నిందితులను విశాఖ చీఫ్ మెట్రోపాలిటిన్ కోర్టులో హాజరు పరచిన వైనం
- ఈ కేసులో ఐపీసీ 467 సెక్షన్ వర్తించదన్న కోర్టు
- నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని సీఐడీకి ఆదేశం
2 సెంట్ల భూమి ఆక్రమణకు అయ్యన్న, ఆయన ఇద్దరు కుమారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించారన్న ఆరోపణల కింద గురువారం తెల్లవారుజామున అయ్యన్నతో పాటు రాజేశ్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితులిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రానికి విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఈ కేసులో నిందితులపై మోపిన ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని తేల్చారు. దీంతో నిందితులకు అక్కడికక్కడే బెయిల్ మంజూరు చేయడంతో పాటు నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సీఐడీని కోర్టు ఆదేశించింది.